కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా సృష్టిస్తున్న భయానక పరిస్థితులను చూస్తూనే వున్నాం. లక్షల్లో ఆ వ్యాధి బారిన పడినవారు ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్నారు. మన దేశంలోనూ ఈ వైరస్ క్రమంగా దాని ప్రభావాన్ని చూపుతోంది. ఐతే వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.
మరోవైపు కరోనా వైరస్‌ను అరికట్టేందుకు తన వంతు బాధ్యతగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ కరోనా పేషెంట్లకు అధునాతన చికిత్స కోసం వంద పడకల ప్రత్యేక వసతిని ఏర్పాటు చేసింది. ఇంకా రోజుకు 1,00,000 మాస్కులను ఉత్పత్తి చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
ముంబై మహానగర పాలిక, సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో ఈ సౌకర్యాన్ని కల్పించారు. ఇందులో వ్యాధి కారక క్రిముల వ్యాప్తిని నిరోధించే గది కూడా వుంది. కేవలం 15 రోజుల్లోనే ఈ 100 పడకల వసతిని ఏర్పాటు చేసినట్టు సంస్థ తెలిపింది. రోగులకు అవసరమైన అన్ని సేవలు అందుబాటులో వుంచినట్లు తెలియజేసింది.