దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా ప్రభుత్వ దావఖానాలన్నీ నిండిపోతున్నాయి. దీంతో స్టార్ హోటళ్లు, కళ్యాణ మండపాలు, క్రికెట్ స్టేడియాలు, ఇండోర్ స్టేడియాలను తాత్కాలిక కోవిడ్ సంరక్షణా కేంద్రాలుగా మార్చుతున్నారు. ఇందులోభాగంగా, ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లోని ఓ క్రికెట్ మైదానం ఇపుడు కోవిడ్ సంరక్షణా కేంద్రంగా మారిపోయింది.
ఇందులో 750 పడకలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్రసింగ్ రావత్ గురువారం పరిశీలించారు. ఈ కేంద్రంలో చికిత్స పొందే కరోనా రోగులకు అత్యవసర సామగ్రితోపాటు మూడుపూటల భోజనం ఉచితంగా అందిస్తామని అధికారులు తెలిపారు.
నిష్ణాతులైన వారితో నిత్యం యోగా, మెడిటేషన్ తరగతులను ఆన్‌లైన్ ద్వారా బోధిస్తారని ఇందుకోసం ఓ భారీ ఎల్‌ఈడీ తెరను సైతం ఏర్పాటు చేశామన్నారు. శానిటేషన్, థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలు, సీసీకెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారు 2,642 కరోనా కేసులు నమోదుకాగా ఇందులో 845 యాక్టివ్ కేసులున్నాయని, 1,745 మంది కోలుకున్నారని, 35 మంది మృతి చెందారని వెల్లడించారు.