తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో భారీగా కేసులు రికార్డవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6,542 పాజిటివ్ కేసులు నమోదవగా.. 20 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారని వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా 2,887 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 46,488 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది.
రాష్ట్రంలో మంగళవారం ఒకే రోజు 1,30,105 పరీక్షలు చేయగా.. 6,542 కేసులు వచ్చాయని పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 898, మేడ్చల్‌లో 570, రంగారెడ్డిలో 532, నిజామాబాద్‌లో 427, సంగారెడ్డిలో 320, నల్గొండలో 285, మహబూబ్‌నగర్‌లో 263, వరంగల్ అర్బన్ 244, జగిత్యాలలో 230, ఖమ్మం జిల్లాలో 246 మంది మహమ్మారి బారినపడ్డారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,67,901కి చేరగా.. ఇప్పటి వరకు 3,19,537 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి మొత్తం 1,876 మంది ప్రాణాలు కోల్పోయారు.