Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వైరస్ కాంటాక్ట్ వ్యక్తులను జల్లెడ పడుతున్నాం: సీఎం కేసీఆర్

కరోనా వైరస్ కాంటాక్ట్ వ్యక్తులను జల్లెడ పడుతున్నాం: సీఎం కేసీఆర్
, గురువారం, 23 ఏప్రియల్ 2020 (10:22 IST)
కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డౌన్ వల్ల, కరోనా వైరస్ సోకిన వారిని ఎప్పటికప్పుడు గుర్తించి కట్టడి చేస్తున్న కారణంగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.
 
బుధవారం జరిపిన పరీక్షల్లో 15 మందికి పాజిటివ్ వచ్చినట్లు తేలిందని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశాలున్నాయన్నారు. కరోనా వైరస్, లాక్ డౌన్ అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రాత్రి 11.30 గంటల వరకు ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 
 
ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, శాంత కుమారి, వైద్యాధికారులు పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో పరిశీలించడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో ఉన్నతాధికారుల బృందం పర్యటించింది. అనంతరం వారు నేరుగా ప్రగతి భవన్ చేరుకుని ముఖ్యమంత్రికి అక్కడి పరిస్థితిని వివరించారు. 
 
గాంధి ఆసుపత్రిలో అందుతున్న చికిత్సను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అన్ని ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపిస్తున్నాయని వైద్యాధికారులు చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఫలితాలు ఇస్తున్నాయన్నారు.

‘‘రాష్ట్రంలో కరోనా సోకిన వారందరినీ గుర్తించాం. వారి ద్వారా ఎవరెవరికి వైరస్ సోకే అవకాశం ఉందో కాంటాక్టు లిస్టు తయారుచేసి పరీక్షలు జరిపాం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏఏ ప్రాంతాల్లో కరోనా వైరస్ సోకిన వారున్నారో ఒక అంచనా దొరికింది. దీని ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా కంటైన్మెంట్లు ఏర్పాటు చేశాం.
 
అక్కడ ప్రజలను బయటకు రానీయకుండా, బయటి వారిని అక్కడికి వెళ్లకుండా కఠినంగా వ్యవహరించాం. కాంటాక్టు వ్యక్తులందరనీ క్వారంటైన్ చేశాం. దీని కారణంగా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టగలిగాం. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతున్నది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. మరికొన్ని రోజులు ప్రజలు ఇదేవిధంగా సహకరించి లాక్ డౌన్ నిబంధనలను, కంటైన్మెంటట్ నిబంధనలు పాటిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా పరీక్షలు చేయించుకోమన్నందుకు ఎస్ఐ తల పగిలింది.. ఎక్కడ?