హైదరాబాద్ నగరంలో రోజురోజుకీ కరోనా విజృంభిస్తోంది. హైదరాబాద్ పరిధిలో 399 పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఈ కరోనా 20 మందిని పొట్టనబెట్టుకుంది. వెస్ట్ జోన్, సౌత్ జోన్లలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. వెస్ట్‌జోన్-138, సౌత్‌జోన్-170, సెంట్రల్ జోన్-45, ఈస్ట్‌జోన్‌లో 33 కేసులు నమోదవగా... నార్త్ జోన్‌లో 13 కేసులు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇక ముంబైలో జర్నలిస్టులకు కరోనా సోకిందన్న వార్తలు విని కలత చెందాను అని మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత మంగళవారం ట్వీట్ చేశారు. జర్నలిస్టులకు కరోనా సోకడం దురదృష్టకరమన్నారు. 'మీడియా మిత్రులు కరోనా నియంత్రణలో ముందుండి పోరాటం చేస్తున్నారు. వార్తలు సేకరించే సమయంలో తమను, తమ కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవాలి' అంటూ కవిత అభ్యర్థిస్తూ ట్వీట్ చేశారు.
మరోవైపు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో చేతనైన సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు స్వీకరించారు. సిద్ధిపేటకు చెందిన ప్రముఖ కళింగ బ్రీడ్స్ ఫార్మర్ పరిశ్రమ ప్రతినిధి కే. సురేందర్ రెడ్డి రూ.5 లక్షల రూపాయల విరాళం అందించినట్లు మంత్రి వెల్లడించారు.