Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్త కరోనా స్ట్రెయిన్ ప్రాణాంతకమైంది.. టీకాల వల్ల తప్పించుకోవచ్చు..

Advertiesment
Boris Johnson
, శనివారం, 23 జనవరి 2021 (12:29 IST)
కొత్త రకం కరోనా వైరస్‌కు సంబంధించి యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కీలక ప్రకటన చేశారు. ఇది వేగంగా వ్యాపించడమే కాకుండా పాత వైరస్‌తో పోలిస్తే ప్రాణాంతకం కూడా అయ్యుండొచ్చని తెలిపారు. ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువయిన తర్వాత మరణాల రేటు పెరిగినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోందని శాస్త్రవేత్తలు తనకు వివరించినట్లు వెల్లడించారు. అయితే, ప్రస్తుతం అక్కడ అందుబాటులోకి వచ్చిన ఫైజర్‌, ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా టీకాలు అన్ని రకాల కరోనా వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తున్నాయని తెలిపారు.
 
ఈ విషయాన్ని బ్రిటన్‌ ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు పాట్రిక్‌ వ్యాలన్స్‌ సైతం ధ్రువీకరించారు. పాత కరోనా వైరస్‌తో పోలిస్తే కొత్త వైరస్‌ ఎక్కువ ప్రాణాంతకమైందనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే, దీన్ని కచ్చితంగా ధ్రువీకరించడానికి ఇంకా స్పష్టమైన సమాచారం రావాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆధారాలను బట్టి చూస్తే.. పాత వైరస్‌ సోకిన ప్రతి వెయ్యి మందిలో 10 మంది చనిపోగా.. కొత్త వైరస్‌ సోకిన 1000 మందిలో 13 మంది చనిపోతున్నట్లు ప్రాథమికంగా తెలిసిందని వివరించారు. 
 
అంటే 30 శాతం అధికంగా ప్రాణాంతకం అని తెలిపారు. అయితే, వ్యాక్సిన్‌ రూపంలో మనకు రక్షణ దొరికినట్లేనని భరోసానిచ్చారు. మరికొన్ని రోజులు కరోనా నిబంధనల్ని పాటిస్తూ వ్యాక్సిన్‌ వేసుకుంటే ముప్పు తగ్గిపోతుందని హామీ ఇచ్చారు. బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన వైరస్‌కు మాత్రం టీకాను కూడా తట్టుకునే సామర్థ్యం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. దీనిపై మరింత లోతైన పరిశోధన జరగాల్సి ఉందన్నారు.
 
బ్రిటన్‌లో ఇప్పటి వరకు 95,981 మంది కరోనాతో మరణించారు. ఐరోపా దేశాల్లో అత్యధిక మరణాలు నమోదైన దేశం ఇదే. కొత్త రకం వైరస్‌ వేగంగా వ్యాపిస్తుండడంతో అక్కడ మళ్లీ లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల్లో కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ.. మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. రోజుకు సగటున 1000 మంది చనిపోతుండడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హోసూర్‌లో కొట్టేశారు ... హైదరాబాద్‌లో చిక్కారు!