ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్... ప్రతి ఒక్కరి కంటిపై కనుకులేకుండా చేస్తోంది. ఈ వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ ఇప్పటికే 120 దేశాలకు వ్యాపించింది. అలాగే, లక్షా 25 వేల మందికి సోకింది. నాలుగు వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ మహమ్మారిపై సంఘటితంగా యుద్ధం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చారు.
అంతేకాకుండా, అత్యవసరం అయితే మినహా విదేశాలకు వెళ్లవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే, దేశ వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో విదేశాలల్లో ఉన్న భారతీయులంతా భయాందోళనకు గురవుతున్నారు.
తాజాగా లండన్ హెర్ట్‌ఫర్డ్ షైర్ యూనివర్సిటీలో 1600 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకున్న ఉదంతం వెలుగు చూసింది. ఈ యూనివర్సిటీలో ఇప్పటికే పలువురు విద్యార్థులకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలినందున అక్కడి తెలుగు విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.
లండన్ నగరంలో వున్న హెర్ట్‌ఫర్డ్ షైర్ వర్సిటీ డి హెవిలాండ్ క్యాంపస్‌లో కరోనా విస్తరించింది. ప్రస్తుతం యూనివర్సిటీ పరిసర ప్రాంతంలో 17 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. వర్సిటీ పరిధిలోను ఒక పాజిటివ్ కేసు నమోదైంది.
ఇంతమందికి పాజిటివ్ వైరస్ కనిపిస్తున్నా.. యూనివర్సిటీ అధికారులు తరగతులు నిర్వహిస్తూ.. విద్యార్థుల్లో భయాందోళన పెంచుతున్నట్లు తెలుస్తోంది. కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థికి రూమ్‌లోనే ట్రీట్మెంట్ ఇస్తున్నారు వైద్యులు. అయితే, పాజిటివ్ కేసుల నేపథ్యంలోనూ వర్సిటీలో క్లాసుల కొనసాగింపుపై విద్యార్థుల ఆందోళన చెందుతున్నారు.
వైరస్ అటాక్ అవుతుందనే భయాందోళనతో తెలుగు విద్యార్థులు భీతిల్లుతున్నారు. క్లాసులు యధావిధిగా కొనసాగిస్తునట్లు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో కాలేజి అధికారులు వెల్లడించారు. తమకు భారత్‌కు తీసుకువచ్చేందుకు తెలుగు ప్రభుత్వాలు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు.