దేశంలో కరోనాతో జనం నానా తంటాలు పడుతుంటే.. ముంబైలో నకిలీ వ్యాక్సిన్లతో దందా నడుపుతున్నారు. తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ హౌసింగ్ సోసైటీలో దాదాపు 400 మందికి నకిలీ వ్యాక్సిన్లను వేసి.. ఈ ముఠా పెద్ద ఎత్తున దోచుకుంది.
వివరాల్లోకి వెళితే.. ముంబైలోని కందివాలి ప్రాంతంలోని హిరానాందానీ ఎస్టేట్ సొసైటీలో మే 30న కరోనా వ్యాక్సినేషన్ క్యాంప్ నిర్వహించారు. దీనిలో భాగంగా సొసైటీలోని సుమారు 390 మంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను తీసుకున్నారు. అయితే.. ఆ వ్యాక్సిన్లు నకిలీవని తెలిసిన తరువాత సోసైటీ సభ్యులు లబోదిబోమంటున్నారు.
అయితే.. ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రి ప్రతినిధిగా చెప్పుకునే.. రాజేష్ పాండే ముందుగా.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేస్తామని సోసైటీ సభ్యులను సంప్రదించాడు. అయితే.. వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను సంజయ్ గుప్తా సమన్వయం చేయగా.. మహేంద్ర సింగ్ అనే వ్యక్తి సొసైటీ సభ్యుల నుంచి నగదును వసూలు చేశాడని సొసైటీ సభ్యులు తెలిపారు. అయితే.. డోసుకు రూ.1,260 చొప్పున రూ.5లక్షలు చెల్లించినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు.
వ్యాక్సిన్ తీసుకున్న తరువాత తమకు ఎలాంటి సందేశాలు అందలేదని పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు ఫోటోలు, సెల్ఫీలు కూడా తీసుకోనివ్వలేదని తెలిపారు. అయితే.. తీరా మెస్సెజ్ రాకపోవడంతో అనుమానం కలిగి.. సంప్రదించగా.. నిందితులు వారు సమాధానం చెప్పలేదని వెల్లడించారు.
ఆ తర్వాత తాము వేసుకున్నది నకిలీ కోవిషీల్డ్ వ్యాక్సిన్లు అని తేలిందన్నారు. అనంతరం.. సొసైటీ సభ్యుల ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.