పెళ్లిపీటల మీద ఉన్న సమయంలోనే వరుడికి కరోనా పాజిటివ్ అని తెలిసిన ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. దీంతో నూతన దంపతులను క్వారంటైన్‌లో ఉంచగా, పెళ్లికి వచ్చిన వారందరికీ కొవిడ్ టెస్టులు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అధికారుల వివరాల ప్రకారం.. చంపావత్, ఛేరా గ్రామానికి చెందిన ఓ యువకుడు ఢిల్లీలో వుంటున్నాడు.
పెళ్లికుదరడంతో స్వగ్రామానికి బయల్దేరాడు. అయితే, ఇంటికి వస్తోన్న సమయంలో దగ్గరలోని చంపావత్ పట్టణంలో ఆ యువకుడు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాడు. నమూనాలు ఇచ్చి ఇంటికి వెళ్లిన యువకుడు పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయాడు.
చివరకు పెళ్లివేడుక జరుగుతున్న సమయంలోనే అధికారులు కొవిడ్ రిపోర్టును నేరుగా మండపానికే తీసుకొచ్చారు. దీనిలో వరుడికి కొవిడ్ పాజిటివ్ తేలిన విషయాన్ని అధికారులు వారికి వెల్లడించారు. దీంతో ఆ వేడుకకు హాజరైనవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.
అయితే, కోవిడ్ నిబంధనల ప్రకారం, మిగిలిన వివాహ ఆచారాలను పూర్తిచేసిన అనంతరం నవదంపతులను క్వారంటైన్‌కు పంపించారు అధికారులు. వివాహానికి హాజరైన గ్రామస్థులకు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని స్థానిక మండల తహసీల్దార్ పంకజ్ చందోలా వెల్లడించారు.