దేశ వ్యాప్తంగా కొత్తగా నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు ఇపుడు నియంత్రణలోనే వుంది. రోజువారీగా 2 వేలకు సమీపంలోనే నమోదవుతున్నాయి. అదేసమయంలో కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఒకటి వెలుగు చూసింది. ఈ సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీగా గుర్తించగా, ఇది వైద్య వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ వేరియంట్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి.
మహారాష్ట్రలో గత వారంతో పోల్చుకుంటే కొత్త కేసులు 17.7 శాతం మేర పెరిగాయి. అందుకు ఎక్స్‌బీబీ ఉప రకాన్నే కారణంగా ప్రస్తావిస్తున్నారు. చలికాలం, పండగల సీజన్ ఉండడంతో ఈ వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉండొచ్చని అంచనావేస్తున్నారు.
బీఏ.2.75, బీజే.1 రకాలు కలిసి ఎక్స్‌బీబీ సబ్ వేరియంట్‌గా ఏర్పడినట్లు వైద్య నిపుణులు వెల్లడించారు. దీనిని ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడులో గుర్తించారు.
గత ఆగస్టు నెలలో సింగపూర్, యూఎస్‌లో ఇది వెలుగులోకి వచ్చింది. దీనికి బీఏ.2.75 కంటే వేగంగా వ్యాప్తి చెందే లక్షణం, రోగనిరోధక శక్తిని ఏమార్చే గుణం ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఎక్స్‌బీబీతో పాటుగా మొదటిసారి ఆ రాష్ట్రంలో బీఏ.2.3.20, బీక్యూ.1 రకాలను కూడా గుర్తించారు. ఇక ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కేసులు పెరుగుదల జనాభా సాంద్రత ఎక్కువగా ఉన్న ఠాణె, రాయ్‌గఢ్, ముంబయిలో కనిపించింది.
ఇదిలావుంటే, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన హెల్త్ మీడియా ప్రకారం.. మొత్తం 2,27,207 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 1542 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.
అలాగే, ఇప్పటివరకు కరోనా వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 5,28,913కి చేరింది. ప్రస్తుతం రికవరీలు 4.40 కోట్లుగా ఉండగా, ప్రస్తుతం క్రియాశీల కేసులు 26449గా ఉన్నాయి.