ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా యానాంలో మళ్లీ రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేశారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూను విధించారు. ఇప్పటికే ఈ జిల్లాలో 133 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దీంతో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి రాష్ట్ర పరిధికి చెందిన యానాంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇందులోభాగంగా, కఠిన ఆంక్షలు అమలు చేస్తూ రాత్రిపూట కర్ఫ్యూను విధించారు.
ఇదిలావుంటే ఏపీలోని 13 జిల్లాల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలోనే కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ జిల్లాలో 2,95,123మంది కరోనా వైరస్ బారినపడగా, 2,93,400 మంది కోలుకున్నారు. 1290 మంది మృత్యువాతపడ్డారు.
ఆ తర్వాత స్థానంలో చిత్తూరు జిల్లా, మూడో స్థానంలో పశ్చిమగోదావరి జిల్లాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ కారణంగా అత్యధికంగా 1959 మంది మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 14495 మంది చనిపోయారు.