కరోనావైరస్‌లో కొత్త రకం ఒకటి శర వేగంగా వ్యాపిస్తున్నందున ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, ఇతర దేశాల్లో ఆంక్షలు విధించారు. గతంలో ఉనికిలో లేని ఈ వైరస్ ఇప్పుడు కొద్ది నెలల్లోనే ఇంగ్లండ్‌లో విపరీతం కాగలిగింది.. ఇదెలా సాధ్యమైంది?
అనేక అనిశ్చిత పరిస్థితులు, సమాధానం లేని ఎన్నో ప్రశ్నల మధ్య వైరస్ కట్టడి ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. వైరస్ నిరంతరం రూపాంతరం చెందుతూనే ఉంటుంది. అందుకే, వైరస్ స్వభావంలో కలుగుతున్న మార్పులపై సునిశితంగా దృష్టిపెట్టడం అత్యంత ఆవశ్యకం.
ఈ కొత్త రకం వైరస్ ఎందుకంత ఆందోళన కలిగిస్తోంది?
ఈ వైరస్ భయం కలిగిస్తుండడానికి ముఖ్యంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి.
* కరోనావైరస్‌లోని ఇతర వైవిధ్యాలను ఇది చాలా తొందరగా కనిపించనివ్వకుండా చేస్తోంది.
* వైరస్‌లోని కొన్ని భాగాలను ప్రభావితం చేస్తూ పరివర్తనం చెందడమనేది కీలకం కావొచ్చు.
* ఇప్పటికే కొన్ని ఉత్పరివర్తనాలు సోకే సామర్థ్యం మరింత పెంచుకున్నాయని ప్రయోగశాలల్లో గుర్తించారు.
ఈ కారణాలన్నీ కలిసి ఈ వైరస్ మరింత ప్రమాదకరం, మరింత సులభంగా వ్యాపిస్తుందన్న సూత్రీకరణకు తీసుకొస్తున్నాయి. అయితే, ఏదీ ఇతమిత్ధంగా చెప్పలేని పరిస్థితి. అనుకూల సమయంలో అనుకూల ప్రదేశంలో వ్యాపించడం వల్ల కొత్తరకం కరోనా వైరస్ మరింతగా కనిపిస్తుండొచ్చు.
ఇంతవరకు ఒక మోస్తరు ఆంక్షలు మాత్రమే ఉన్న లండన్ వంటి నగరాల్లో ఇది ప్రబలంగా కనిపించడం అలాంటిదే కావొచ్చు. అయితే, ఇప్పుడీ కొత్తరకం వైరస్ నియంత్రణకు లండన్ మరింత కఠినమైన ఆంక్షల దిశగా సాగుతోంది. ''ప్రయోగాశాలల్లో తనిఖీ చేయడం అవసరం. కానీ, అందుకోసం వారాలు, నెలల తరబడి వేచి ఉండి ఫలితాలు వచ్చాక చర్యలు ప్రారంభిస్తామా? ఇలాంటి పరిస్థితుల్లో అస్సలు నిరీక్షించరాదు'' అని కోవిడ్-19 జినోమిక్స్ యూకే కన్సార్టియంకు చెందిన ప్రొఫెసర్ నిక్ లోమాన్ అన్నారు.
ఇది ఎంత వేగంగా వ్యాపిస్తోంది?
ఈ కొత్తరకం కరోనావైరస్‌ను మొదట సెప్టెంబరులోనే గుర్తించారు. నవంబరు నాటికి లండన్‌లోని మొత్తం కేసుల్లో పావు వంతు ఈ కొత్తరకమే. డిసెంబరు రెండోవారం ముగిసేనాటికి మూడింట రెండొంతుల కేసులు ఇవే. ఈ కొత్త రకం వైరస్ ఎంత ప్రబలంగా ఉందనడానికి మిల్టన్ కీనెస్ లైట్‌హౌస్ లేబొరేటరీ వంటి కేంద్రాల్లోని ఫలితాలే ఉదాహరణ.
ఈ కొత్త రకానికి 70 శాతం అధికంగా సోకే సామర్థ్యం ఉన్నట్లు ఇటీవల బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రస్తావించారు. ఈ కారణంగానే ఆర్-నంబర్(వైరస్ వ్యాప్తి రేటును సూచించే సంఖ్య) పెరుగుతుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. లండన్ ఇంపీరియల్ కాలేజ్‌కు చెందిన డాక్టర్ ఎరిక్ వాల్జ్ ఇటీవల తన ప్రజెంటేషన్‌లోనూ కొత్త రకానికి 70 శాతం అధిక వ్యాప్తి సామర్థ్యమున్నట్లు ప్రస్తావించారు.
''అప్పుడే ఏమీ కచ్చితంగా చెప్పలేనప్పటికీ ఈ కొత్తరకం వైరస్ మాత్రం చాలా వేగంగా వ్యాపిస్తున్నట్లు అర్థమవుతోంది. కరోనావైరస్‌లోని ఇంతకుముందరి వేరియంట్ల కంటే ఇది వేగంగా సోకుతోంది. దీనిపై పూర్తిగా దృష్టి పెట్టడం చాలా అవసరం'' అన్నారు డాక్టర్ ఎరిక్.
ఇది ఏ స్థాయిలో వ్యాపించింది?
ఈ కొత్త వేరియంట్ ఎలా వ్యాపించిందనే విషయంలో రెండు భావనలున్నాయి. బ్రిటన్‌లోనే ఎవరైనా కరోనారోగిలో ఇది ఉత్పరివర్తనం చెంది ఉండొచ్చని.. లేదంటే, కరోనావైరస్ మ్యూటేషన్లను పరిశీలించే సామర్థ్యం తక్కువగా ఉన్న దేశాల నుంచి ఇది వచ్చి చేరి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ కొత్త వేరియంట్ బ్రిటన్ వ్యాప్తంగా, ఉత్తర ఐర్లాండ్‌లోనూ కనిపిస్తున్నప్పటికీ ప్రధానంగా లండన్, ఇంగ్లండ్‌లోని ఆగ్నేయ.. తూర్పు ప్రాంతాల్లో నమోదవుతున్న కేసుల్లో అత్యధికం ఇవే ఉంటున్నాయి.
కాగా డెన్మార్క్, ఆస్ట్రేలియాలో కేసులు బ్రిటన్ నుంచి వచ్చినవేనని ప్రపంచవ్యాప్తంగా వివిధ వైరల్ శాంపిల్స్ జన్యు సంకేతాలను పర్యవేక్షిస్తున్న 'నెక్స్ట్ స్ట్రెయిన్' సంస్థ డాటా చెబుతోంది. దక్షిణాఫ్రికాలోనూ ఇలాంటిదే కొత్త వేరియంట్ ఒకటి వ్యాప్తిలో ఉన్నప్పటికీ దానికీ దీనికీ ఎలాంటి సంబంధం కనిపించలేదు.
ఇంతకుముందు ఇలా జరిగిందా?
అవును.. చైనాలోని వుహాన్‌లో తొలుత కరోనావైరస్‌ను గుర్తించిన తరువాత ప్రపంచమంతటా వ్యాపించినప్పటికీ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్‌కు వుహాన్ వైరస్‌కు వ్యత్యాసం ఉంది. ఫిబ్రవరిలో యూరప్‌లో డీ614జీ అనే మ్యుటేషన్ మొదలైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఏ222వీ అనే మరో రకం యూరప్ అంతటా వ్యాపించింది.
కొత్త మ్యుటేషన్ల గురించి మనకు ఎంతవరకు తెలుసు?
ఈ కొత్త రకం వైరస్ గురించి ప్రాథమికంగా కొన్ని శాస్త్రీయ విశ్లేషణలు వచ్చాయి. మానవ శరీర కణాల్లోకి వైరస్ ప్రవేశించడానికి ఉపకరించే కరోనావైరస్‌పైన స్పైక్ ప్రోటీన్‌లో మార్పులు గుర్తించారు. ఎన్501వై అనే ఒక మ్యుటేషన్ కరోనావైరస్ స్పైక్ ప్రోటీన్‌లోని కీలక భాగమైన 'రిసెప్టర్ బైండింగ్ డొమైన్'ను మార్పులకు గురిచేస్తున్నట్లు గుర్తించారు.
ఈ భాగమే మానవ శరీర కణాలను మొదట తాకుతుంది.. దీనిలోని మార్పులు అది మరింత వేగంగా సోకేలా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మ్యుటేషన్ సోకే గుణాన్ని రెండింతలు పెంచినట్లు ప్రయోగాశాల పరీక్షలలో తేలిందని కేంబ్రిడ్జ్ ప్రొఫెసర్ రవి గుప్తా చెప్పారు.
ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాణాంతకమా?
ఈ కొత్త వేరియంట్ అసాధారణ స్థాయిలో చాలా వేగంగా ఉత్పరివర్తనం చెందుతోంది. అయితే, ఇది సోకిన తరువాత ప్రాణాలు పోయే ప్రమాదం మరింత పెరుగుతుందా అనేది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే, వైరస్ సోకిన కేసులు ఎక్కువయ్యే కొద్దీ అన్ని రకాలుగా సమస్యలు ఉత్పన్నమవుతాయన్నది వాస్తవం. తక్కువ సమయంలో ఎక్కువ మంది సోకితే ఆసుపత్రులు నిండిపోతాయి.
ఇప్పుడొస్తున్న వ్యాక్సీన్లు ఈ కొత్త వేరియంట్‌పై పనిచేస్తాయా?
వ్యాక్సీన్లు ఈ కొత్త వేరియంట్‌పైనా పనిచేసే అవకాశాలే ఎక్కువ. కనీసం, ప్రస్తుతానికైనా అవి పనిచేస్తాయి. ప్రస్తుతం కేసులు పెరుగుతున్న కాలంలోనే ప్రధానమైన మూడు వ్యాక్సీన్లు అభివృద్ధి చేశారు. సాధారణంగా వ్యాక్సీన్లు వైరస్‌లోని వివిధ భాగాలను నాశనం చేసేలా తయారుచేస్తారు. కాబట్టి కరోనావైరస్ స్పైక్ ప్రోటీన్‌లో మ్యుటేషన్లు ఉన్నప్పటికీ మిగతా భాగాలను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాక్సీన్లు సమర్థంగా పని చేస్తాయని చెపుతున్నారు.