దేశంలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. యూరప్‌తో పాటు ఇతర దేశాల్లోనూ కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. దీంతో కరోనా సెకండ్ వేవ్ భారత్‌ను తాకుతుందని వైద్యులు హెచ్చరిస్తున్న తరుణంలో ముందస్తు చర్యలు చేపడుతున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. కరోనా కట్టడికి మళ్లీ లాక్‌డౌన్ విధిస్తే ఎలా ఉంటుందని ఓవైపు కొన్ని రాష్ట్రాలు ఆలోచన చేస్తున్నాయి. లాక్ డౌన్ దిశగా కొన్ని రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి.
మరోవైపు.. మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు మాత్రం కర్ఫ్యూ విధించాలని నిర్ణయించాయి. అయితే, ఈ కర్ఫ్యూ రాత్రి సమయంలో మాత్రమే అమలు చేయనున్నారు. నవంబర్ 21 నుంచి ఇండోర్, భోపాల్, గ్వాలియర్, విదిశ, రత్లామ్ జిల్లాల్లో కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని మహారాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ వెల్లడించారు.
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. మరోవైపు.. గుజరాత్‌లోనూ శనివారం నుంచే కర్ఫ్యూ అమల్లోకి రానుంది. రాజ్‌కోట్, సూరత్, వడోదరలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయనున్నట్టు సీఎం నితిన్ పటేల్ ప్రకటించారు. ఇక, అహ్మదాబాద్‌లో శుక్రవారం రాత్రి నుంచి నవంబర్ 23వ తేదీ ఉదయం 6 గంటలకు సంపూర్ణంగా కర్ఫ్యూను అమల్లో ఉండనుంది.