ప్రపంచంలోనే సుందర నగరంగా పేరొందిన ఇటలీలో కరోనా వైరస్ మరణమృదంగం సాగిస్తోంది. ఈ కరోనా వైరస్ ధాటికి ఇటలీ పూర్తిగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లింది. అయినప్పటికీ.. కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య, మరణిస్తున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఈ అందమైన నగరంపై కరోనా పగబట్టినట్టుగా తెలుస్తోంది. దీన్ని నిరూపించేలా గత 24 గంటల్లో ఏకంగా 793 మంది మృత్యువాతపడ్డారు. ఫలితంగా ఇటలీలో కరోనా వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 4825కు చేరింది. ఈ కరోనా వైరస్ పురుడుపోసుకున్న చైనాలో కంటే.. ఇటలీలోనే అధికంగా ఈ మరణాలు నమోదు కావడం ఇపుడు ప్రపంచాన్ని వణికిస్తోంది.
చైనాలో కరోనా వైరస్ బారినపడి 3255 మంది చనిపోయారు. గత మూడు రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కావడంలేదు. కానీ, ఇటలీలో పరిస్థితి భిన్నంగా ఉంది. వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అలాగే, మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. గత రెండు రోజుల్లోనే ఇటలీలో ఏకంగా 1420 మంది చనిపోయారు.
మిలన్ నగర సమీపంలోని ఉత్తర లోంబార్డీ ప్రాంతంలోనే ఏకంగా 3000 మంది మృత్యువాత పడటం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతోంది. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. బయటకు వస్తే భారీ జరిమానాలు విధిస్తోంది.
అలాగే, ఇంగ్లండ్ వాసులను కూడా ఈ కరోనా వైరస్ భయకంపితులను చేస్తోంది. శనివారం ఒక్కరోజే 55 మంది మృతి చెందారు. దీంతో ఆ దేశంలో కరోనా మహమ్మారికి బలైనవారి సంఖ్య 177కు చేరింది. దేశవ్యాప్తంగా నాలుగు వేలకుపైగా కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం దేశవ్యాప్తంగా షట్‌డౌన్ అమల్లోకి తీసుకొచ్చింది.
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు కొనసాగుతున్నాయి. వైరస్ నియంత్రణకు భారత్ దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటిస్తుండగా, చాలా దేశాలు షట్‌డౌన్ ప్రకటించాయి. ఇక, ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 13 వేలు దాటిపోగా, బాధితుల సంఖ్య 3 లక్షలు దాటింది. దాదాపు 96 వేల మంది కోలుకున్నారు.