తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరో కరోనా వైరస్ పాజిటీవ్ కేసు నమోదైంది. ఇటలీ నుంచి నగరానికి వచ్చిన వ్యక్తికి కోవిడ్-19 పాజిటీవ్‌గా వచ్చినట్లు ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టంచేశారు.
అలాగే, ఇటలీ నుంచి వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులకు కూడా ఈ వైరస్ లక్షణాలు సోకినట్టు భావిస్తున్నారు. ధృవీకరణ కోసం వారి రక్త నమూనాలను పూణేలో గల నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించినట్లు తెలిపారు. జన సమూహా ప్రదేశాలకు ప్రజలు దూరంగా ఉండాల్సిందిగా అధికారులు మరోమారు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు, కరోనా వైరస్ అనేక దేశాలకు విస్తరిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ దేశం కఠిన ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. ఆదివారం రాత్రి నుంచి దేశానికి వస్తున్న వారెవరైనా.. స్వయంగా ఐసోలేషన్‌లోకి వెళ్లాలని ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెన్ తెలిపారు.
ఇప్పుడు క్షమాపణలు చెప్పుకునే సమయం కాదు అని, అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ఆమె అన్నారు. తాము అమలు చేయనున్న రూల్స్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైనవని ప్రధాని జెసిండా అన్నారు.
కాగా, కివీస్‌లో ఇప్పటివరకు ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే తమ ఆదేశాలపై మరో 16 రోజుల తర్వాత సమీక్ష ఉంటుందన్నారు. ప్రజల నిత్యావసరాల కోసం విమాన, ఓడల ద్వారా జరిగే రవాణాలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయన్నారు.