కరోనా వ్యాక్సిన్‌కు షార్క్ చేపలకు సంబంధం వుందంటే నమ్ముతారా? తప్పకుండా నమ్మి తీరాల్సిందే. షార్క్ చేపల కాలేయం నుంచి తీసే నూనెను కరోనా వ్యాక్సిన్ తయారీలో ఉపయోగిస్తున్నారట. స్క్వాలిన్ పేరుతో పిలవబడే ఈ నూనె రోగ నిరోధక శక్తి పెంచటానికి ఎంతగానో ఉపయోగపడుతుందని.. దీని అవసరం ప్రస్తుతం కోవిడ్ కాలంలో చాలా ముఖ్యమని కాలిఫోర్నియా కేంద్రంగా పని చేసే ఓ టీకా తయారీ సంస్థ అభిప్రాయపడింది. ఇప్పటికే ఈ స్వ్కాలిన్‌ను బ్రిటన్‌కు చెందిన ఫార్మాసూటికల్ కంపెనీ ఫ్లూ వ్యాక్సిన్‌ల తయారీలో వాడుతోంది.
ప్రతి సంవత్సరం స్క్వాలిన్ కోసం 30లక్షల షార్క్‌లను చంపుతున్నారు. ఈ లివర్ ఆయిల్‌ను కాస్మోటిక్స్, యంత్ర సంబంధ పరికరాల్లో సైతం వాడుతున్నారు. మూడు వేల పెద్ద షార్క్ చేపల నుంచి టన్ను స్క్వాలిన్ వస్తుంది. అయితే కరోనా కష్టంలో ప్రపంచంలోని జనాభాకు దీన్ని ఉపయోగించి చేసిన టీకా ఇవ్వాలంటే ఐదు లక్షల షార్క్‌లు అవసరమవుతాయని నిపుణులు చెప్తున్నారు.
స్క్వాలిన్ అధికంగా ఉండే గుల్పర్ షార్క్, బాస్కింగ్ షార్క్ ప్రస్తుతం అంతరించే దశలో ఉన్నాయి. అయినా వాటి వేట కొనసాగుతోంది. ఈ కరోనా ప్రభావం ఇంకెన్ని రోజులు ఉంటుందో.. ఎన్ని వ్యాక్సిన్‌లు తయారు చేస్తారో ఇప్పుటికిప్పుడే చెప్పటం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో టీకా తయారీకి షార్క్‌ల వేట ప్రారంభిస్తే వాటి మనుగడపై తీవ్ర ప్రభావం పడుతుందని పలువురు వాపోతున్నారు.
ఇతర సమద్ర జీవుల్లా షార్క్‌లు పెద్ద సంఖ్యలో సంతానాన్ని ఉత్పత్తి చేయలేవు. ఈ నేపథ్యంలో స్క్వాలిన్‌కు ప్రత్యామ్నాయంగా పులియబెట్టిన చెరుకు గడ నుంచి తీసే పదార్థాన్ని వాడేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు.