కరోనా వైరస్ బారినపడి తిరిగి కోలుకున్న బాధితుల్లో వివిధ రకాలైన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరిలో కంటిచూపు మందగిస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కంటి నరంలో కొన్ని సమస్యలు తలెత్తడం వల్ల కంటిచూపు తగ్గుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.
ఒక్కసారిగా చూపు మసకబారడం, కంటి నాళాల్లో గడ్డల ద్వారా రెటీనాకు రక్త ప్రసరణకు ఆటంకాలు ఏర్పడటం జరుగుతుంది. ప్రధానంగా కోవిడ్ బారినపడి స్టెరాయిడ్స్ వాడి రికవరీ అయినవారిలో ఈ పరిస్థితి కనిపిస్తుందని అంటున్నారు.
అందువల్ల కోవిడ్ నుంచి కోలుకున్న వారు కంటి చూపునకు సంబంధించిన సమస్యలు వస్తే... వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. అంతేకాకుండా, కరోనా నుంచి కోలుకున్న వారు తమ శరీరంలో చోటు చేసుకునే మార్పులపై కూడా ఓ కన్నేసి ఉంచాలని కోరుతున్నారు.