కరోనా వైరస్ మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా, కరోనా డెల్ట్ వేరియంట్ ముప్పు ఇంకా పొంచివుందని తెలిపింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన వీక్లీ నివేదికలో హెచ్చరించింది.
ఈ వేరియంట్‌తో ముడిపడిన కేసులు అన్ని ప్రాంతాల్లోనూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నెల 13 నాటికి 111 దేశాల్లో ఈ వేరియంట్ ఉనికి ఉందని, మున్ముందు ఇది మరింత పెరిగే అవకాశం ఉందని, అందువల్ల ప్రపంచ దేశాలు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపింది
అలాగే, ఆల్ఫా వేరియంట్ 178 దేశాల్లోనూ, బీటా రకం 123, గామా వేరియంట్ 75 దేశాల్లోనూ ఉనికిలో ఉన్నట్టు వివరించింది. ఆందోళన రకం వైరస్‌లలో డెల్టా వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉందని వివరించింది. తక్కువ సంఖ్యలోనూ వ్యాక్సిన్లు పూర్తి కావడంతో ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోందని పేర్కొంది. ఇప్పటి వరకు ప్రపంచంలోని నాలుగోవంతు జనాభాకు మాత్రమే తొలి విడత వ్యాక్సిన్ అందిందని, ఈ విషయంలో సంపన్న దేశాలే ఎక్కువ టీకాలు అందుకున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో వివరించింది.