ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కిన్నెటా పవర్‌కు కేటాయించిన భూములను రద్దు చేసి, ఆ భూములకు జిందాల్ స్టీల్‌కు అప్పగించింది. ఇపుడు జిందాల్‌కు ఏకంగా 860 ఎకరాల భూములను కేటాయించింది.
నెల్లూరు జిల్లాలోని తమ్మినపట్నం - మోమిడి గ్రామాల పరిధిలో భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్థలంలో రూ.7,500 కోట్లతో 11.6 మిలియన్ టన్నుల సామర్థ్యంతో జిందాల్ స్టీల్ ప్లాంటును నెలకొల్పనున్నారు.
ఈ ప్లాంట్ ద్వారా 2,500 మందికి ప్రత్యక్షంగా, 15 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. వచ్చే నాలుగు ఏళ్లలో ప్లాంట్ విస్తరణకు వెయ్యి నుంచి 3 వేల ఎకరాల భూమి అవసరమవుతుందని జిందాల్ స్టీల్ అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగానే ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
మరోవైపు, త్వరలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం వైసీపీ అధినాయకత్వం తాడేపల్లిలో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించింది. పార్టీ ఎంపీలందరూ హాజరైన ఈ సమావేశంలో సీఎం జగన్ పాల్గొని, పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహ, ప్రతివ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశం అనంతరం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, విభజన హామీలన్నింటిని అమలు చేయాలని పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదా కోసం వైసీపీ మొదటి నుంచి పోరాడుతోందని, పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనూ అది కొనసాగుతుందని అన్నారు. ఈ అంశాన్ని ఇప్పటివరకు 12 పర్యాయాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమన్నారు.
ఇక, పోలవరం సవరించిన అంచనాల గురించి పార్లమెంటులో ప్రస్తావిస్తామని, పోలవరం పెండింగ్ నిధుల అంశాన్ని లేవనెత్తుతామన్నారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టుల విషయాన్ని కూడా పార్లమెంటుకు వివరిస్తామని తెలిపారు. కేఆర్ఎంబీ పరిధిని కేంద్రం నోటిఫై చేయాలని కూడా కోరతామని విజయసాయి పేర్కొన్నారు.
ముఖ్యంగా, ఏపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తోందని, ఇదే అంశాన్ని పార్లమెంటు ఉభయసభల్లో కేంద్రానికి స్పష్టం చేస్తామని వెల్లడించారు. ఈ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంపీలు కృషి చేస్తారని తెలిపారు.