కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తయారు చేసిన వ్యాక్సిన్‌కు కేంద్రం ధర ఫిక్స్ చేసింది. ముఖ్యంగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్యిన్ ధరను ఖరారు చేశారు. ఒక్కో డోసును రూ.250కి అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు శనివారం అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శులు, జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్‌గౌబ, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్‌లు దీనిపై స్పష్టతనిచ్చారు.
టీకా ధర రూ.150 కాగా, ప్రైవేటు ఆస్పత్రులు సర్వీసు చార్జీగా మరో రూ.100 వసూలు చేయనున్నాయి. దీంతో డోసు ధర రూ.250 అవుతుంది. అయితే రెండో డోసుకు సేవా రుసుము ఉంటుందా? ఉండదా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
రెండో విడత వ్యాక్సినేషన్ కోసం టీకా కంపెనీల నుంచి ఒక్కో డోసును రూ.167కి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఈ ధరలో కొంత రాయితీ ఇచ్చి రూ.150కే ప్రైవేటు ఆస్పత్రులకు డోసులను సమకూర్చనుంది.
మరోవైపు, 60 ఏళ్లకు పైబడినవారు, 45-59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి మార్చి 1 నుంచి వ్యాక్సినేషన్ చేయనున్న నేపథ్యంలో రాష్ట్రాల కార్యాచరణ, టీకా ధరపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.