ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 11,775 శాంపిళ్లను పరీక్షించగా మరో 141 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 59 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 4,402 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 1,723 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,599 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 80కి చేరింది.
మరోవైపు, దేశంలో కూడా కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశంలో తొలిసారిగా కరోనా కేసులు ఒక్కరోజులో 10 వేల మార్కును దాటాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 10,956 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 396 మంది మరణించారు. ఇప్పటి వరకు ఒకరోజులో సంభవించిన మరణాల్లో ఇదే అత్యధికం.
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,97,535కి చేరగా, మృతుల సంఖ్య 8,498కి చేరుకుంది. 1,41,842 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,47,195 మంది కోలుకున్నారు. మొత్తంమీద కరోనా కేసుల్లో ఇప్పటికే బ్రిటన్, స్పెయిన్ దేశాలను అధికమించిన భారత్... స్వదేశీయంగా కూడా 3 లక్షలకు చేరువలోకి వచ్చింది.