గోవాలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో 15 రోజుల లాక్‌డౌన్ కోసం ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. 15 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో పాటు.. రాష్ట్ర సరిహద్దులను కూడా మూసివేయాలని విపక్ష ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
గోవా ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత దిగంబర్ కామత్ అధ్యక్షతన ఇవాళ జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఈ సమావేశంలో గోవా ఫార్వార్డ్ పార్టీ, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ కూడా పాల్గొన్నాయి. ''రాష్ట్ర ప్రభుత్వం గోవాలో 15 రోజుల లాక్‌డౌన్‌కు ఆదేశించాలి.
లాక్‌డౌన్ సమయంలో పొరుగు రాష్ట్రాల సరిహద్దులను కూడా మూసివేయాలి. నిత్యావసర వస్తువులు, మందులు, వైద్య సామగ్రిని తరలించే వాహనాలు, ప్రభుత్వ వాహనాలను మాత్రమే అనుమతించాలి...'' అని తీర్మానంలో పేర్కొన్నారు.
కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులు, సైనిక సిబ్బందితో ప్రమోద్ సావంత్ ప్రభుత్వం ఓ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. దీంతో పాటు ఆక్సిజన్, వెంటిలేటర్లు, వ్యాక్సీన్లు, బెడ్‌ల లభ్యతపై ''శ్వేత పత్రం'' విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కరోనా నెగిటివ్ రిపోర్టు ఉన్నవారినే రాష్ట్రంలోకి అనుమతించాలని విపక్ష నేతలు ప్రభుత్వానికి సూచించారు. కాగా గోవా ప్రభుత్వం ఇప్పటికే ఏప్రిల్ 29 రాత్రి నుంచి మే 3 ఉదయం వరకు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీన్ని ఈ నెల 10 వరకు పొడిగించారు.