స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ సీజన్14 నిరవధిక వాయిదాపడింది. ఈ మేరకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పలు జట్ల ఆటగాళ్లు వైరస్ బారిన పడుతుండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 14వ సీజన్‌కు సంబంధించి ఐపీఎల్ మ్యాచ్‌లను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల ప్రకటించారు.
ఆటగాళ్ల కరోనాబారిన పడుతుండటంతో తాజా పరిస్థితులపై చర్చించేందుకు ఐపీఎల్ పాలక మండలి, బీసీసీఐ మంగళవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించాయి. ఈ భేటీలో ఈ ఐపీఎల్ సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.
ఆటగాళ్లు, సహాయక సిబ్బంది భద్రత విషయంలో బీసీసీఐ రాజీపడదని.. అందరి క్షేమం దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ప్రస్తుత టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నాం. తర్వాత పరిస్థితులు ఎప్పుడు అనుకూలిస్తే అప్పుడు కొనసాగిస్తాం. కానీ, ఈ నెలలో అది సాధ్యం కాకపోవచ్చు అని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ వ్యాఖ్యానించారు.
కాగా, రెండు రోజులుగా పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. సన్‌రైజర్స్ ఆటగాడు వృద్ధిమాన్ సాహాకు కరోనా నిర్ధారణ కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు ఐసోలేషన్‌లోకి వెళ్లారు. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా కరోనా బారినపడ్డాడు.
ఢిల్లీ మైదానంలో సిబ్బందిలో కొంతమందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కోల్‌కతా ఆటగాళ్లు వరణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌లకు తాజాగా చేసిన పరీక్షల్లో కరోనా నిర్ధరణ అయింది. చెన్నై బౌలింగ్ కోచ్ బాలాజీ కూడా పాజిటివ్‌గా నివేదిక వచ్చింది. బయో బబుల్‌లో కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ ఆటగాళ్లు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.