కరోనా సెకండ్ వేవ్‌లో కరోనా కొత్త వేరియెంట్లు చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై ప్రతాపం చూపిస్తున్నాయి. తొలి దశలో 3-4 శాతం మంది పిల్లలపై మహమ్మారి ప్రభావం చూపగా.. ప్రస్తుతం ఇది 20 శాతానికి పైగా పెరిగింది. థర్డ్ వేవ్ లో 80 శాతం మంది చిన్నారులు వైరస్‌బారిన పడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పిల్లల్లో వైరస్ లక్షణాలను ఎలా గుర్తించాలి, ఎలాంటి చికిత్స అందించాలన్న దానిపై కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. మెజార్టీ పిల్లల్లో కరోనా సోకినప్పటికీ వారిలో లక్షణాలు ఉండట్లేదని, కొందరిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని తెలిపింది.
లక్షణాలు:
జ్వరం, దగ్గు, అలసట, ఊపిరిలో ఇబ్బంది, ముక్కుదిబ్బడ, గొంతులో మంట, కండరాల నొప్పులు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, కడుపులో నొప్పి
ఏమివ్వొచ్చు
జ్వరం: పారాసిటమాల్ 10-15 ఎంజీ/కేజీ/డోసు (ప్రతి 4-6 గంటలకు ఒకసారి ఇవ్వొచ్చు)
గొంతులో మంట, దగ్గు: గోరువెచ్చని నీటిని పుకిలించడం
ఆహారంగా ఏమిస్తే మంచిది: నీరు, పండ్ల రసాలతో పాటు పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వడం మంచిది.
తేలికపాటి/లక్షణాలు లేని వారికి చికిత్స ఎలా అంటే?
కరోనా సోకిన పిల్లల లక్షణాలను బట్టి తేలికపాటి, మధ్యస్థాయి, తీవ్రమైన అని మూడు విభాగాలుగా విభజించారు. జ్వరం, జలుబు వంటి స్వల్ప లక్షణాలు ఉండి ఇతర ఆరోగ్య సమస్యలేమీ లేని పిల్లలకు లేదా లక్షణాలు లేని పిల్లలకు ఇంట్లోనే చికిత్స అందించొచ్చు.
ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, తరుచుగా విరేచనాలు, వాంతులు, కడుపునొప్పితో పాటు ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన సమస్యలున్న చిన్నారుల్లో వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తరలించాలి.
కొందరు పిల్లల్లో కరోనా.. మల్టీసిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ సమస్యకు దారి తీస్తోంది. కాబట్టి పిల్లలు ఆందోళనతో గందరగోళంగా ప్రవర్తించినా వైద్యులను సంప్రదించడం మంచిది. మామూలు జలుబు, జ్వరం ఉంటే పిల్లలు ఒకట్రెండు రోజుల్లో కోలుకుంటారు. రోజుల తరబడి అవే లక్షణాలుంటే మాత్రం ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిపుణులు చెబుతున్నారు.