ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ జీవితకాలంపై ఇపుడు సర్వత్రా చర్చ సాగుతోంది. ముఖ్యంగా, ఈ వైరస్ మనిషి శరీరంపై చేరితే ఎంత సమయం జీవించి ఉంటుందన్న చర్చ మొదలైంది. తాజాగా జపాన్ పరిశోధకులు జరిపిన ఓ అధ్యయనం మేరకు కరోనా వైరస్ మానవ చర్మంపై 9 గంటల వరకు యాక్టివ్‌గా ఉంటుందని గుర్తించారు.
ఫ్లూ వంటి వ్యాధి కారకాలు మానవ చర్మంపై సుమారు 1.8 గంటలు జీవించి ఉండగా కరోనా వైరస్ మాత్రం 9 గంటల వరకు జీవిస్తున్న విషయాన్ని కనుగొన్నారు. కరోనాతో చనిపోయిన వ్యక్తి నుంచి ఒక రోజు తర్వాత సేకరించిన చర్మాన్ని వారు పరీక్షించారు.
ఇన్‌ఫ్లూఎంజా ఏ వైరస్(ఐఏవీ)తో పోల్చితే మానవ చర్మం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదం ఎక్కువని చెప్పారు. మానవ చర్మం మహమ్మారిని వ్యాప్తిని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు. దీంతో కరోనా వైరస్ ఎంత ఎక్కువ సమయం మానవుల చర్మంపై ఉంటే అది వ్యాప్తి చెందే ప్రమాదం అంతగా ఉంటుందని తెలిపారు.
శానిటైజర్‌లో వినియోగించే ఇథనాల్ వల్ల కరోనాతోపాటు ఫ్లూ వైరస్ 15 సెకండ్లలో ఇన్‌యాక్టివ్‌గా మారడాన్ని జపాన్ పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మానవ చర్మంపై 9 గంటల వరకు జీవించే కరోనా వైరస్‌ను నాశనం చేసేందుకు తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం ఎంతో అవసరమని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను సమర్ధించారు.