దేశంలో కరోనావైరస్ వ్యాప్తి రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. మరోవైపు కోలుకొన్న కేసుల సంఖ్య కోటికి చేరువవుతోంది. మరోవైపు కొవిడ్ టీకాలకు ఆమోదం లభించడంతో దేశంలో సానుకూల వాతావరణం కనిపిస్తోంది.
తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం 16,504 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దాంతో వారం రోజుల వ్యవధిలో రెండోసారి అత్యల్ప కేసులు వచ్చాయి. డిసెంబర్ 28 తరవాత ఈ తగ్గుదల నమోదైంది. కాగా, నిన్నటితో మొత్తం కేసుల సంఖ్య 1,03,40,469కి చేరింది.
నిన్న 7,35,978 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అయితే, కేసుల సంఖ్య తగ్గడానికి కరోనా పరీక్షల్లో తగ్గుదల కూడా ఓ కారణంగా కనిపిస్తోంది.
ఇక క్రియాశీల కేసులు 2.5లక్షలకు దిగువనే కొనసాగుతున్నాయి. నిన్నటి వరకు దేశంలో 2,43,953 క్రియాశీల కేసులుండగా.. ఆ రేటు 2.39శాతానికి చేరింది.
ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు 99,46,867 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 96.16 శాతంగా ఉంది. మరోవైపు గత 10రోజులుగా మరణాలు 300 దిగువనే ఉంటున్నాయి. గడిచిన 24 గంటల్లో 214 మంది ఈ మహమ్మారికి బలికాగా.. మొత్తం మరణాల సంఖ్య 1,49,649గా ఉంది..