Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు 10 లక్షలు - బ్రెజిల్‌ను క్రాస్ చేస్తుందా?

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు 10 లక్షలు - బ్రెజిల్‌ను క్రాస్ చేస్తుందా?
, శుక్రవారం, 17 జులై 2020 (10:16 IST)
దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. ఫలితంగా ప్రతి వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 34,956 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 687 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 10,03,832కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 25,602కి పెరిగింది. 3,42,473 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 6,35,757 మంది కోలుకున్నారు.
 
కాగా, గురువారం వరకు దేశంలో మొత్తం 1,30,72,718 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,33,228 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
మరోవైపు, దేశంలో కరోనా మహమ్మారి విస్తరణ వేగం మరింతగా పెరగడం ఇపుడు ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది. మన దేశంలో తొలి కరోనా కేసు జనవరి 30న కేరళలో వెలుగులోకి రాగా, ఆపై దాదాపు 170 రోజుల్లోపే 10 లక్షలకు పైగా కేసులు రావడం గమనార్హం.
 
ఇక రాష్ట్రాలను పరిశీలిస్తే, మహారాష్ట్ర ముందు నిలిచింది. గురువారం రాష్ట్రంలో 8,641 కేసులు రాగా, మొత్తం కేసుల సంఖ్య 2,83,281కి చేరింది. 11,194 మంది చనిపోయారు. ఆ తర్వాతి స్థానంలో ఉన్న తమిళనాడులో 1,56,369 మంది వైరస్ బారిన పడ్డారు. 
 
మూడో స్థానంలో ఉన్న దేశ రాజధాని న్యూఢిల్లీలో 1,18,645 మందికి వ్యాధి సోకింది. కర్ణాటకలో గురువారం కొత్తగా 4,149 మందికి వైరస్ సోకగా, మొత్తం కేసుల సంఖ్య 50 వేల మార్క్‌ను దాటేసింది.
 
జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం ప్రపంచంలో కోటికి పైగా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో అత్యధికంగా 35 లక్షల కేసులు వచ్చాయి. రెండో స్థానంలో కొనసాగుతున్న బ్రెజిల్ లో 19.66 లక్షల కేసులున్నాయి. 
 
ఇక భారత్‌లో ఇదే విధంగా కేసుల పెరుగుదల కొనసాగితే, ఆగస్టు రెండో వారంలోపే కేసుల సంఖ్య విషయంలో బ్రెజిల్‌ను దాటేసే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవాడలో రౌడీలపై పోలీసులు దృష్టి!