Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో పెరిగిపోతున్న కరోనా రోగులు.. వీసాలు రద్దు.. కేంద్రం హైఅలెర్ట్

దేశంలో పెరిగిపోతున్న కరోనా రోగులు.. వీసాలు రద్దు.. కేంద్రం హైఅలెర్ట్
, గురువారం, 12 మార్చి 2020 (15:03 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. ఇపుడు భారత్‌ను కూడా గజగజలాడిస్తోంది. ఈ వైరస్ బారినపడివారి సంఖ్య దేశంలో పెరిగిపోతోంది. ఇప్పటివరకు మొత్తం 73 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపింది. ఢిల్లీలో 6, హర్యానాలో 14, కేరళలో 17, రాజస్థాన్‌లో 3, తెలంగాణలో 1, ఉత్తరప్రదేశ్‌లో 10, లడఖ్‌లో 3, తమిళనాడులో 1, జమ్మూకశ్మీర్‌లో 1, పంజాబ్‌లో 1, కర్ణాటకలో 4, మహారాష్ట్రలో 11 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలిందని తెలిపింది. 
 
దేశంలోని కరోనా పాజిటివ్‌ అని తేలిన వారిలో 56 మంది దేశీయులే ఉన్నారు. భారత్‌లోని విమానాశ్రయాల్లో ఇప్పటివరకు 10,57, 506 మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. కరోనాపై పార్లమెంటులో విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ ఆందోళన వ్యక్తంచేశారు. 'ఇది ఆందోళనకర విషయం. ఇప్పటివరకు దేశంలో కరోనా సోకిన వారు 73 మంది ఉన్నారు. అసాధారణ పరిస్థితులను అరికట్టడానికి అసాధారణంగానే స్పందన ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి' అని సూచించారు. 
 
మరోవైపు, కరోనా వైరస్ పుట్టిన చైనాలో మాత్రం ఇది తగ్గుముఖం పట్టింది. కానీ, మిగిలిన దేశాల్లో మాత్రం విజృంభిస్తోంది. ప్రపంచం మొత్తం మీద 117 దేశాలకు పైగా విస్తరించింది. ఈ వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 4100కు చేరింది. ఇరాన్‌లో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య 7161కి చేరుకుంది. వ్యాధి కారణంగా సోమవారం 43 మంది మరణించగా ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 237గా నమోదైంది. 
 
దేశంలో కరోనా (కొవిడ్‌-19) కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సుమారు నెలపాటు సాధారణ వీసాలన్నింటిని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. దౌత్య, అధికార, ఐరాస, అంతర్జాతీయ సంస్థలు, ఉద్యోగుల, ప్రాజెక్టు వీసాలు తప్ప సాధారణ వీసాలన్నింటిని ఏప్రిల్‌ 15 వరకు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. శుక్రవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. 
 
కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రవాస భారతీయులకు (ఓసీఐ కార్డుదారులకు) కల్పించిన వీసా రహిత పర్యాటక సౌకర్యాన్ని ఏప్రిల్‌ 15 వరకు నిలుపుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 15 తర్వాత చైనా, ఇటలీ, ఇరాన్‌, దక్షిణ కొరియా, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, జర్మనీ నుంచి వచ్చిన లేదా ఆయా దేశాలను సందర్శించిన విదేశీ పర్యాటకులు, భారతీయులను 14 రోజులపాటు వేరుగా (క్వారంటైన్‌లో) ఉంచనున్నట్లు తెలిపారు.
webdunia
 
అంతర్జాతీయ క్రూయిజ్‌ నౌకలు, సిబ్బంది, ప్రయాణికుల ప్రవేశంపై మార్చి 31 వరకు నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర నౌకాయాన మంత్రిత్వశాఖ పేర్కొన్నది. అలాగే అంతర్జాతీయ క్రూయిజ్‌ నౌకలను థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాట్లున్న పోర్టుల్లోకి మాత్రమే అనుమతిస్తామని, సిబ్బంది, ప్రయాణికులు తమ వివరాలను స్వీయ పత్రంలో పేర్కొని పోర్టు ఆరోగ్య అధికారికి సమర్పించాలని, ఎవరికైనా కరోనా సోకినట్లు తేలితే నౌక నుంచి దిగేందుకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టంచేసింది. 
 
తాజా గణాంకాల ప్రకారం 1,10,000 మందికి పైగా ప్రజలకు వైరస్‌ సోకింది. వ్యాధి కారణంగా కొత్తగా 17 మంది ప్రాణాలు కోల్పోయారని చైనా తెలిపింది. చైనాలో కరోనా బాధితుల మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. చైనాలోనే వైరస్‌ బాధితుల సంఖ్య 80,754కు చేరగా.. 3,136 మరణించారు.  ఇటలీలో పరిస్థితి రోజురోజుకీ చాలా దారుణంగా తయారవుతోంది. ఒక్క రోజులోనే 133 మంది చనిపోవడంతో మృతుల సంఖ్య 463కు చేరింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీలంక యువతి ధైర్యం : టూరిస్ట్ వీసాపై వచ్చి ప్రియుడితో సహజీవనం