దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతుండటం ఊరటనిస్తోంది. పలు రాష్ట్రాల్లో విధించిన ఆంక్షలతో గత కొన్ని రోజులుగా కొత్త కేసుల సంఖ్య లక్షకు దిగువనే నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 62వేల మంది వైరస్ బారినపడగా.. లక్షకు పైనే కొవిడ్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. అయితే క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసుల్లో స్వల్ప పెరుగుదల కన్పించింది.
మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 19,30,987 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 62,224 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.96కోట్లకు చేరింది. వరుసగా తొమ్మిదో రోజు పాజిటివిటీ రేటు 5శాతానికి దిగువనే ఉంది.
ఇదే సమయంలో 1,07,638 మంది వైరస్ నుంచి కోలుకున్నాయి. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 2.83కోట్లుగా ఉంది. రికవరీ రేటు 95.80శాతానికి పెరిగింది.
కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో క్రియాశీల కేసుల సంఖ్య 9లక్షల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8,65,432 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 2.92శాతంగా ఉంది.
ఇక మరణాల సంఖ్య కూడా 3 వేలకు దిగువనే ఉంటడం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. 24 గంటల వ్యవధిలో మరో 2542 మంది కరోనాకు బలయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 3,79,573 మందిని వైరస్ పొట్టనబెట్టుకుంది.
మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న మరో 28లక్షల మందికి టీకాలు వేశారు. దీంతో మొత్తం వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 26కోట్లు దాటింది.