ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న జిల్లాల్లో చిత్తూరు జిల్లా ఒకటి. ఈ జిల్లాలో నమోదైన కేసులన్నీ బెంగుళూరు, చెన్నై నగరాల నుంచి వచ్చిన వారికి చెందినవే కావడం గమనార్హం.
తాజాగా ఆదివారం చిత్తూరులో ఆరు కరోనా కేసులు నమోదుకాగా వాటిలో నలుగురు చెన్నైకు చెందిన వారు. చెన్నై నుంచి గొడుగుమూరుకు వచ్చిన భార్యభర్తలకు వలంటీర్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది.
అనారోగ్యంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్సలు చేసుకుని బంధువుల ఇంటికి వచ్చిన అత్తా, కోడలు రెడ్డీస్ కాలనీలోని బంధువుల ఇంటికి వచ్చారు. వారికి పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది.
అలాగే, 25వ డివిజన్‌లోని బాలాజీ కాలనీకి చెందిన ఓ అమ్మాయి స్వీడన్ నుంచి రెండు రోజుల క్రితం నగరానికి రాగా కరోనా వచ్చింది. రాంనగర్‌కాలనికి చెందిన హోంగార్డుకు ఇది వరకే కరోనా సోకగా.. తాజాగా ఆయన భార్యకు పాజిటివ్ వచ్చింది.
కాగా, చెన్నైలో కరోనా విళయతాండవడం చేస్తుండటంతో సమీప మండలాలతో పాటు చిత్తూరుకు చాలా మంది బంధువులు వస్తున్నారు. వీరిలో చాలామందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. వీరివల్ల స్థానికంగా మరికొందరికి సోకే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.