Publish Date: Wed, 05 Mar 2008 (13:06 IST)
Updated Date: Wed, 05 Mar 2008 (13:06 IST)
సాధారణంగా నాన్ వెజ్ ఇష్టపడే వారికి ఎప్పుడూ చికెన్, మటన్ తింటే బోర్ కొడుతుంది. అలా కాకుండా ప్రాన్స్‌తో రకరకాలుగా, రుచికరంగా కొన్ని వంటకాలు చేయొచ్చు. వాటిలో కొన్ని మీకోసం...
కావలసిన పదార్థాలు :
చిన్న చిన్న రొయ్యలు - 200 గ్రాములు, కోడిగుడ్లు - రెండు, యాలకులు - ఐదు, దాల్చిన చెక్కలు - ఐదు, జీలకర్ర - రెండు చెంచాలు, ఉప్పు - తగినంత, కారం - రెండు చెంచాలు, ఉల్లిపాయలు - నాలుగు, వెల్లుల్లి - ఒకటిన్నర, పసుపు - చిటికెడు, అల్లం - చిన్న ముక్క, నూనె - 75 గ్రాములు.
తయారు చేయు విధానం :
ముందుగా రొయ్యలన్నిటినీ శుభ్రంగా కడిగి ప్రక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అల్లం, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, వెల్లుల్లి తదితర మసాలా సామానంతా కలిపి నూరి పెట్టుకోవాలి. ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. బాణాలిలో పావు సేరు నీరు పోసి కాగాక శుభ్రం చేసిన రొయ్యల్లో మసాలా సామాను పెట్టి పసుపు కూడా పట్టించి ఉడికించాలి.
ఉడికిన రొయ్యలను తీసి మెత్తాగా రోట్లో నూరిన తర్వాత దీంట్లో గుడ్లను పగులగొట్టి కలపాలి. ఈ ముద్దను తీసి కావలిసిన ఆకారంలో చేసుకుని బాణాలిలో కాగిన నూనెలో వేసి ఎర్రగా రెండు వైపులా వేయించాలి. తర్వాత దీనిపై మసాలా పొడి చల్లి సైడ్ డిష్‌గా తినొచ్చు.