స్కూల్స్‌కు వెళ్లే పిల్లలకు పోషకాహారం చాలా ముఖ్యం. ముఖ్యంగా అల్పాహారంలో పోషకాహారాలు పుష్కలంగా వుండేలా చూసుకోవాలి. ఉదయం పూట పిల్లలు పాఠశాలలకు వెళ్లే హడావుడిలో బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం మానేస్తారు. ఇలా చేయడం కరెక్ట్ కాదు.
ఎందుకంటే ఉదయం పూట తీసుకునే ఆహారం మెదడును ప్రభావితం చేస్తుందని న్యూట్రీషియన్లు అంటున్నారు. ఉదయం పూట తీసుకునే ఆహారం పిల్లల్లో ఏకాగ్రతను పెంచుతుందని.. ఆ రోజంతా చురుకుగా వుండేలా చేస్తుందని వారు చెప్తున్నారు. ఉదయం పూట నిద్రలేచిన వెంటనే పిల్లలు బ్రష్ చేసుకున్నాక.. గ్లాసుడు నీరు తాగడం అలవాటు చేయాలి. కాలకృత్యాలు పూర్తి చేసుకుని.. స్నానం చేశాక తప్పకుండా అల్పాహారాన్ని తీసుకునేలా చేయాలి.
ఒకవేళ అల్పాహారం తీసుకోకపోతే.. అది పిల్లల మెదడు ఆరోగ్యాన్ని మందగించేలా చేస్తుంది. అల్పాహారంగా కోడిగుడ్డు, తృణధాన్యాలు, చిరుధాన్యాలు వుండేలా చూసుకోవాలి. తక్కువ చక్కెర కలిగిన తృణధాన్యాల అల్పాహారం, గోధుమ రొట్టె, వెన్న, పాలు, తక్కువ చక్కెర కలిగిన పాల ఉత్పత్తులు, గుడ్లు, బీన్స్ వంటివి ఆరోగ్యకరమైన అల్పాహార ఆహారాలు. ఇంకా అల్పాహారంలో ప్రోటీన్లు, పీచు వుంటే పిల్లల మెదడు ఆరోగ్యంగా వుంటుంది. ఇంకా చదువుపై ఏకాగ్రత ఏర్పడుతుంది.