Publish Date: Tue, 02 Dec 2014 (18:26 IST)
Updated Date: Tue, 02 Dec 2014 (18:28 IST)
తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ విద్యా సంస్థలో ప్లస్ టూ స్టూడెంట్ రెచ్చిపోయాడు. దుష్ప్రవర్తనకు మందలించడంతో 12వ తరగతి చదివే విద్యార్థి తన మహిళా కంప్యూటర్ టీచర్‌పై చేజేసుకున్నాడు.
సోమవారం తరగతి నడుస్తున్న సమయంలో ఆ విద్యార్థి కంప్యూటర్లకు విద్యుత్తు అందించే మెయిన్ స్విచ్‌ను ఆఫ్ చేశాడు. అందుకు గాను, అతన్ని టీచర్ మందలించింది. సరిగా ప్రవర్తించడం నేర్చుకోవాలని ఆమె అతనితో చెప్పింది. దాంతో విద్యార్థి రెచ్చిపోయి టీచర్‌పై చేయి చేసుకున్నాడు.
గతంలో కూడా ఆ విద్యార్థి దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు ఉన్నాయని, క్షమాపణ చెప్పిన తర్వాత పాఠశాలలో కొనసాగడానికి అతనికి అనుమతి ఇచ్చినట్లు సమాచారం.
తాజా సంఘటనపై జిల్లా విద్యాధికారులకు నివేదించారు. సీనియర్ అధికారులు సంఘటనపై విచారణ జరిపారు. విద్యార్థిపై తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అంటున్నారు.
అయితే, పాఠశాల అధికారులు పోలీసులకు ఏ విధమైన ఫిర్యాదు కూడా చేయలేదు. విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేయకూడదని నిర్ణయించుకున్నారు. తాము ఫిర్యాదు చేయదలుచుకోలేదని పాఠశాల అధికారులు చెప్పినట్లు పోలీసులు ధ్రువీకరించారు.