చిన్నమ్మతో తంబిదురై తదితరుల ములాఖత్.. రాష్ట్రపతి ఎన్నికల్లో రాజకీయం చూపించాలని నిర్ణయం
పరప్పన అగ్రహార చెరలో ఉన్న శశికళతో మూడోసారిగా మంగళవారం దినకరన్ ములాఖత్ అయ్యారు. ఆయనతో పాటుగా సెంథిల్ బాలాజీ, పళనియప్పన్ తదితర ఐదుగురు ఎమ్మెల్యేలు శశికళను కలిశారు. రాష్ట్రంలో పళనిస్వామి ప్రభుత్వం సాగిస్తున్న వ్యవహారాలు, పార్టీలతో తమకు వ్యతిరేకంగా స
పరప్పన అగ్రహార చెరలో ఉన్న శశికళతో మూడోసారిగా మంగళవారం దినకరన్ ములాఖత్ అయ్యారు. ఆయనతో పాటుగా సెంథిల్ బాలాజీ, పళనియప్పన్ తదితర ఐదుగురు ఎమ్మెల్యేలు శశికళను కలిశారు. రాష్ట్రంలో పళనిస్వామి ప్రభుత్వం సాగిస్తున్న వ్యవహారాలు, పార్టీలతో తమకు వ్యతిరేకంగా సాగుతున్న పరిణామాలు, అసంతృప్తి ఎమ్మెల్యేల గురించి చిన్నమ్మకు వివరించినట్టు సమాచారం. ఈసందర్భంగా మీడియాతో దినకరన్ మాట్లాడుతూ, తమ కుటుంబంలో ఎలాంటి విబేధాలు లేవని, దివాకరన్‌తో సాగుతున్న వివాదంపై స్పందించారు.
వివాదాలన్నీ పనిగట్టుకుని సృష్టిస్తున్నారని, తమ కుటుంబీకులు అందరూ ఐక్యతతోనే ఉన్నట్టు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌పై చిన్నమ్మ తన నిర్ణయాన్ని పార్టీకి పంపుతారని, అందుకు తగ్గ ప్రకటన వెలువడుతుందన్నారు. ఇక, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై చిన్నమ్మతో వేరుగా ములాఖత్ కావడం గమనార్హం. చాలాకాలం అనంతరం చిన్నమ్మతో ఆయన భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రపతి ఎన్నికలపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని మీడియాతో మాట్లాడుతూ తంబిదురై వ్యాఖ్యానించడం విశేషం.
కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటు బీజేపీకి అనుకూలంగా పడే రీతిలో పార్టీ వర్గాలకు సందేశం ఇవ్వాలన్న సంకేతాన్ని చిన్నమ్మకు తంబి దురై సూచించినట్టు సమాచారం. అలాగే, ఇదే ఎన్నికల్ని అడ్డం పెట్టుకుని కేంద్రాన్ని ఎదుర్కొందామా.. లేదా, సామరస్యంగా సాగుదామా.. అన్న అంశంపై దినకరన్ మంతనాలు సాగించినట్టు తెలిసింది. అయితే, తన రాజకీయ తంత్రాన్ని ఎన్నికల తేదీ నాటికి ప్రయోగించేందుకు చిన్నమ్మ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.