కోర్టులో సాక్షాత్తూ జడ్జి ముందే ఒక వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచాడు. ఈ సంఘటన చెన్నై హైకోర్టులో జరిగింది. చెన్నైకి చెందిన శరవణన్‌కి, అతని భార్య వరలక్ష్మికి చాలా కాలంగా సమస్యలు ఉన్నాయి. దీనితో వారు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఇందులో భాగంగా ఓ కేసు విచారణకు వీరిద్దరూ మంగళవారం ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు.
మద్రాస్ హైకోర్టులోని మొదటి అంతస్తులో ఉన్న ఫ్యామిలీ కోర్టులో జడ్జి ముందు విచారణ జరుగుతున్న సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో ఆవేశానికి లోనైన భర్త శరవణన్ అవతలివైపు ఉన్న వరలక్ష్మి వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లి, కత్తితో పొడిచేసాడు.
ఈ సంఘటనతో అక్కడ ఉన్నవారంతా అవాక్కయ్యారు. వెంటనే అప్రమత్తమైన లాయర్లు, అక్కడున్నవారు శరవణన్‌ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దాడికి గురైన మహిళను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.