అధికారంలోకి వస్తే జయ మృతి కారకుల పని పడతా.. స్టాలిన్ కొత్త పాట
రాజకీయం ఎన్ని ఆటలైనా ఆడుతుందనడానికి జయలలిత లేని తమిళనాడు రాజకీయాలే పచ్చి నిదర్శనంగా నిలుస్తున్నాయి. జీవించి ఉన్నంతవరకు జయలలితను బద్ధశత్రువుగా పరిగణించి తీవ్ర పోరాటం చేసిన డీఎంకే అధినేత కరుణానిధి తనయుడు స్టాలిన్ ఇప్పుడు ఉన్నట్లుండి జయ జపం చేయనారంభించా
రాజకీయం ఎన్ని ఆటలైనా ఆడుతుందనడానికి జయలలిత లేని తమిళనాడు రాజకీయాలే పచ్చి నిదర్శనంగా నిలుస్తున్నాయి. జీవించి ఉన్నంతవరకు జయలలితను బద్ధశత్రువుగా పరిగణించి తీవ్ర పోరాటం చేసిన డీఎంకే అధినేత కరుణానిధి తనయుడు స్టాలిన్ ఇప్పుడు ఉన్నట్లుండి జయ జపం చేయనారంభించారు. అది కూడా అమ్మ నమ్మినబంటు పన్నీర్ సెల్వమే అమ్మ మృతిపై విచారణపై డిమాండును మర్చిపోతున్న వేళ స్టాలిన్ ఉన్నట్లుండి ఇప్పుడు ఒంటికాలిపై లేచి నిలబడి అమ్మ జపం చేస్తున్నారు.
రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా బలమైన ప్రధాన ప్రతిపక్ష డీఎంకే నేత స్టాలిన్ సోమవారం సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. అధికార అన్నాడీఎంకేలో వైరివర్గాల నినాదంగా ఉన్న దివంగత జయలలిత మరణ మిస్టరీ ఛేదించే బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. అన్నాడీఎంకే వరకే పరిమితమైన జయ మరణ మిస్టరీలో సోమవారం అకస్మాత్తుగా స్టాలిన్ జోక్యం చేసుకున్నారు. అన్నాడీఎంకేలోని కుమ్ములాటలతో విసిగిపోయి ఉన్న ప్రజలు అమ్మను పదేపదే గుర్తు చేసుకుంటున్నారు. అమ్మపై చెరిగిపోని అభిమానాన్ని గుర్తించిన స్టాలిన్ ఆమెను పొగడడం ప్రారంభించారు.
స్వయంశక్తి కలిగిన నాయకురాలుగా జయలలిత అధికారంలోకి వస్తే ఆమె మరణం తరువాత నేడు బినామీలు రాజ్యం ఏలుతున్నారని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకేలోని ఎమ్మెల్యేలు రేసు గుర్రాల్లా అమ్ముడుపోయారని ఎద్దేవాచేశారు. అమ్మ మరణం వెనుక దాగి ఉన్న మర్మాన్ని అన్నాడీఎంకే వర్గాలు దాదాపు మరిచిపోతున్న దశలో స్టాలిన్ ప్రస్తావించడం విశేషం. పైగా డీఎంకే అధికారంలోకి వస్తే దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ కమిషన్ వేస్తామని చెప్పడం ద్వారా రాబోయే ఎన్నికల్లో ఇదే ప్రధాన అస్త్రంగా మలుచుకుంటున్నారు.
వేలూరు జిల్లా రాణిపేటలో సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో స్టాలిన్ మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేదు. రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లవరకు చెల్లించి కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల మద్దతుతో బినామీ ప్రభుత్వం సాగుతోంది’’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ఎన్నికలు ముగియగానే అన్నాడీఎంకే ప్రభుత్వం పడిపోవడం, ప్రజాదరణతో డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తంచేశారు. జయలలిత మరణం వెనుక కుట్ర దాగి ఉన్నట్లు తేలితే దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆయన తెలిపారు.