Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాష్ట్రంలోని అల్పసంఖ్యాకులు ఏమైపోయారు.. స్పందించిన తమిళనాడు మైనార్టీ సంక్షేమ శాఖ!

Advertiesment
Dravida Desam Krishna Rao
తమిళనాడులోని అల్పసంఖ్యాకులు (తమిళేతరులు) ఏమైపోయ్యారు? అనే అంశంపై తమిళనాడు మైనార్టీ సంక్షేమ శాఖ స్పందించింది. తమిళనాడు రాష్ట్రంలో తెలుగువారి సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ద్రావిడదేశం అధ్యక్షుడు వి.కృష్ణారావు ఇచ్చిన లేఖతో ఈ శాఖలో కదలిక వచ్చింది. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో తమిళభాషాభివృద్ధి శాఖామంత్రి వద్ద పనిచేసిన అనుభవంతో వి.కృష్ణారావు తన పరపతి, పలుకుబడిని ఉపయోగించి తమిళనాడులోని అల్పసంఖ్యాకులు ముఖ్యంగా తెలుగు ప్రజల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, తెలుగుభాషాభివృద్ధి కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు.
 
ఇందులోభాగంగా ఇటీవల ఆయన తమిళనాడు ప్రభుత్వానికి ఓ లేఖ ఇచ్చారు. ఇందులో అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా 1968 లెక్కల ప్రకారం తమిళనాడు రాష్ట్రంలో నివశించే తెలుగు ప్రజల శాతం 40గా ఉండేదని, ఆ తర్వాత 1993లో రాష్ట్ర వెనుకబడిన కులాలు, మైనార్టీ శాఖ విడుదల చేసిన జీవో నంబరు 83 ప్రకారం ఈ సంఖ్య 11 జిల్లాలో కలిపి మొత్తం 15 శాతానికి తగ్గిందని గుర్తు చేశారు. ఇందులో తెలుగు, కన్నడం, మలయాళం, ఉర్దూ ఇతర మైనార్టీ భాషలు మాట్లాడేవారు ఉన్నారని, ఈ అల్పసంఖ్యాకులు తమ సమస్యలపై తమ మాతృభాషల్లో వినతిపత్రం సమర్పిస్తే.. అదే భాషలో ఇవ్వాలన్నది ఆ జీవో సారాంశంగా ఉండేదని వివరించారు.
 
 
అయితే, కాలక్రమంలో తమిళ భాషావృద్ధిలో భాగంగా ఇతర భాషలపై సవతి తల్లి ప్రేమను చూపిస్తూ వచ్చారు. దీంతో 2001లో వెల్లడైన జనాభా లెక్కల ప్రకారం ఈ సంఖ్య 5 శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన తాను సంబంధిత శాఖల అధికారులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో పాటు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖామంత్రి అబ్దుల్ రెహమాన్‌తో ప్రత్యేకంగా సమావేశమై సమస్యను వివరించడమే కాకుండా, ఒక వినతి పత్రం కూడా సమర్పించినట్టు పేర్కొన్నారు. ఈ వినతి పత్రంపై మంత్రి రెహమాన్ ప్రత్యేకంగా దృష్టిసారించి.. తన శాఖలోని ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపి ప్రత్యుత్తర రూపంలో సమాధానమిచ్చినట్టు తెలిపారు. 
 
ఇందులో 1993లో విడుదలైన జీవో నంబర్ 83 ప్రస్తుతం అమల్లో లేదని అందువల్ల ఈ అంశంపై ఇచ్చిన వినతిపత్రంపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, దీనిపై తీసుకున్న చర్యలను వివరిస్తూ ప్రభుత్వానికి కూడా ఒక నివేదికను పంపాలని రాష్ట్ర మైనార్టీ కమిషన్‌కు మంత్రి ఆదేశాలు కూడా జారీచేశారు. ఈ మేరకు తనకు మైనార్టీ మంత్రిత్వ శాఖ నుంచి ప్రత్యుత్తరం వచ్చిందని వి.కృష్ణారావు విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu