చెన్నై మహానగరంలో అంతు చిక్కని జ్వరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, శివారు ప్రాంతాల్లో జలుబు, పొడిదగ్గుతో కూడిన జ్వరాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. దీంతో రోగులు ప్రభత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వాతావరణ మారింది. రాత్రి సమయాల్లో వర్షాలు కురుస్తూ పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.
సాయంత్రమైతే భిన్నవాతావరణం కనిపిస్తుంది. అదేసమయంలో చలి, పొడిదగ్గు, ముక్కులోంచి నీరు కారడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందినా తగ్గడం లేదని చెబుతున్నారు. కొందరు రెండు వారాలకు పైగా ఒళ్లు, గొంతునొప్పితో ఇబ్బంది పడుతున్నారు. మధ్య వయసున్న వారిలో దీని ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో బాధితుల సంఖ్య పెరుగుతోంది.
చెన్నై నగరంలోనే రోజుకు వెయ్యి మందికి పైగా వివిధ రకాల జ్వరాలతో ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. దోమల నిర్మూలనలో ప్రజారోగ్యశాఖ, మున్సిపల్ కార్పొరేషన్లు నిర్లక్ష్య వైఖరితో ఉండటంతోనే జ్వరాలు విజృంభిస్తున్నాయని వైద్య నిపుణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి ఆరోగ్య నిపుణుడు కుళందైసామి మాట్లాడుతూ.. శీతోష్ణస్థితి మార్పుల కారణంగా ఫ్లూ, జలుబు లాంటి వైరల్ జ్వరాలు వస్తాయని, ప్రస్తుతం 70శాతం ఇన్ఫ్లెయెంజా కేసులున్నట్టు తెలిపారు. అదే సమయంలో డెంగీ వచ్చే అవకాశం ఉందని చెప్పారు.