ప్రముఖ దర్శకుడు మణిరత్నం సోదరుడు జి.వెంకటేశ్వరన్ చనిపోయిన తర్వాత చెన్నైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసు విచారణ నుంచి ఆయన పేరును తొలగించించింది. ఆయనపై నమోదైన బ్యాంకు మోసం కేసులో చెన్నై సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం తీర్పునిచ్చింది. ఆయన మరణించిన కారణంగా ఈ కేసు నుంచి ఆయన పేరును తొలగిస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే, 1996లో నిర్మాత జి.వెంకటేశ్వరన్ తప్పుడు పత్రాలు సమర్పించి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.10.19 కోట్ల రుణం పొందినట్టు ఆరోపణలు వచ్చాయి. బ్యాంకు ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. సుమారు మూడు దశాబ్దాల పాటు సాగిన ఈ కేసు విచారణలో చెన్నై ప్రత్యేకకోర్టు తాజాగా తీర్పును వెలువరించింది.
ఈ కేసులో నిందితులుగా ఉన్న తొమ్మిది మందిని కోర్టు దోషులుగా తేల్చింది. అయితే, ప్రధాన నిందితుడు వెంకటేశ్వరన్‌తో సహా మరో ముగ్గురు బ్యాంకు అధికారులు విచారణ కొనసాగుతుండగానే మరణించారు. దీంతో మరణించిన వారిపై ఉన్న అభియోగాలను కోర్టు కొట్టివేసింది. మిగిలిన ఐదుగురు దోషుల పరిస్థితిపై త్వరలోనే స్పష్టతరానుంది.
కాగా, జి.వెంకటేశ్వరన్ తన సోదరుడు మణిరత్నం దర్శకత్వంలో మౌనరాగం, దళపతి వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. అయితే, తీవ్రమైన అప్పుల ఒత్తిడి కారణంగా ఆయన 2003 మే 3వ తేదీన ఆత్మహత్య చేసుకున్నారు. సినిమాలు తీయడానికి చేసిన అప్పులు, వాటి వల్ల వచ్చిన నష్టాలను తట్టుకోలేక ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.