Publish Date: Fri, 02 Jan 2015 (15:36 IST)
Updated Date: Fri, 02 Jan 2015 (15:38 IST)
తమిళనాడులో ఇద్దరు ప్రేమికుల వ్యవహారం ఇది. పదేళ్ల తర్వాత పెళ్లాడిన ప్రేమ జంట ఇపుడు పోలీసు స్టేషనుకు వచ్చారు. తమిళనాడులోని తిరువత్తియూరులో జరిగిన వివరాలను చూస్తే.... తమిళనాడు తేని జిల్లా ఉత్తమపాళెం రాయపట్టికి చెందిన 34 ఏళ్ల జాన్సన్, శివగంగ జిల్లా ఇళయాన్ గుడిసైకి చెందిన 26 ఏళ్ల లీమారోజ్ పదేళ్ల క్రితం ప్రేమికులయ్యారు.
ఐతే జాన్సన్ ఉద్యోగం నిమిత్తం మధురై వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో వారిమధ్య ఫోన్ ప్రేమాయణం సాగింది. 2005లో జాన్సన్ ప్రమాదానికి గురవడంతో అతడి ఫోను నుజ్జునుజ్జయి పోయింది. దీంతో ప్రేయసితో సంబంధాలు తెగిపోయాయి. ఇంట్లో వీరి విషయం ఎవరికీ తెలియకపోవడంతో వ్యవహారం బయటకు రాలేదు.
ఆ తర్వాత ప్రమాదంలో జాన్సన్ మృతి చెందినట్లు రోజ్ కు సమాచారం వచ్చింది. దాంతో ఆమె అతడిని తప్ప వేరే వ్యక్తిని భర్తగా స్వీకరించనని తేల్చి చెప్పింది. అలా పదేళ్లు గడిచిపోయింది. ఐతే జాన్సన్ ప్రమాదంలో మృత్యువుతో పోరాడి కోలుకున్నాడు. తన ప్రేయసిని వెతుక్కుంటూ మళ్లీ అక్కడికే రావడంతో ఆమె అతడిని పెళ్లాడేందుకు నిర్ణయించుకుంది. ఐతే ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో వారు పోలీసు స్టేషనును ఆశ్రయించారు.