ఉప ఎన్నిక రద్దు ఈసీ చరిత్రాత్మక తప్పిదం: దినకరన్ మండిపాటు
ఆర్కే నగర్ ఉప ఎన్నికను రద్దు చేయడం ద్వారా ఈసీ చరిత్రాత్మక తప్పిదానికి పాల్పడిందంటూ అన్నాడీఎంకే అభ్యర్థి, శశికళ కొడుకు దినకరన్ మండిపడ్డారు.
మెజారిటీని సాకుగా పెట్టుకుని తమిళనాడులో అధికారాన్ని కైవసం చేసుకుని విర్రవీగిన శశికళ వర్గానికి మొదటి ఎదురు దెబ్బ తగిలింది. తనకు ప్రజాబలం లేదని ప్రతిపక్షమైన డీఎంకే, పన్నీర్ సెల్వం తదితర పార్టీలు పదే పదే ఆరోపిస్తున్న నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గం ఆర్కె నగర్లో ఏప్రిల్ 12న జరుగనున్న ఉప ఎన్నికలో గెలిచి అందరికీ పాఠం నేర్పాలని ఎదురుచూసిన శశికళ వర్గానికి పిడుగుపాటు లాంటి దెబ్బ తగిలింది.
అత్యంత కీలకంగా మారిన ఈ ఉప ఎన్నిక కోసం దాదాపు రూ. 89 కోట్ల మేరకు ఓటర్లకు శశికళ వర్గం పంచిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆదివారం కీలక భేటీ నిర్వహించిన ఈసీ.. ఆర్కే నగర్ ఉప ఎన్నికను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా అధికార పార్టీ నేతలు ఇప్పటికే ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు పంచారు.
ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఉప ఎన్నికలో గెలిచి.. ఎలాగైనా పట్టు నిరూపించుకోవాలని అన్నాడీఎంకే శశికళ వర్గం తీవ్రంగా శ్రమించింది. ఆదివారం రాత్రి వరకు కూడా ఆర్కే నగర్‌లో అన్నాడీఎంకే నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఇంతలో ఈసీ ప్రకటించిన ఉప ఎన్నిక నిర్ణయం ఆ పార్టీని ఇరకాటంలో పడేసింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికను రద్దు చేయడం ద్వారా ఈసీ చరిత్రాత్మక తప్పిదానికి పాల్పడిందంటూ అన్నాడీఎంకే అభ్యర్థి, శశికళ కొడుకు దినకరన్ మండిపడ్డారు.
అదే సమయంలో అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప ఈసీ నిర్ణయాన్ని స్వాగతించారు. ’ఈ ఎన్నిక పారదర్శకంగా జరగడం లేదని గుర్తించి ఈసీ జోక్యం చేసుకుంది. దేశంలో రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం బతికే ఉందనడానికి, భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనడానికి ఇది నిదర్శనం’ అని ఆమె కొనియాడారు. ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, నటుడు శరత్ కుమార్, ఇంకొందరికి చెందిన 32 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుపగా రూ.90 కోట్ల వరకు నగదును ఓటర్లకు సరఫరా చేసినట్లు వెల్లడైంది. దీంతో ఇంకా వెలుగులోకిరాని పంపకాలు భారీ స్థాయిలోనే జరిగి ఉంటాయని ఐటీ శాఖ భావించింది.