తమిళ రాజకీయాల్లో రికార్డు సృష్టించిన కరుణానిధి: 92 ఏళ్లలో సీఎం పీఠం కోసం..!
కరుణానిధి కొత్త రికార్డు: 92 ఏళ్లలో సీఎం పీఠం కోసం..
Publish Date: Mon, 07 Mar 2016 (12:16 IST)
Updated Date: Mon, 07 Mar 2016 (12:18 IST)
డీఎంకే అధినేత కరుణానిధి పేరిట కొత్త రికార్డు నమోదైంది. తమిళనాడు రాజకీయాల్లో సీఎం పీఠం కోసం పోటీకి దిగుతున్న వృద్ధనేత కరుణ రికార్డును నమోదు చేశారు. ప్రస్తుతం 92 ఏళ్లు నిండిన కరుణానిధి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
ఐదేళ్ల క్రితం జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే చేతిలో ఘోర పరాజయం చవిచూసిన నేపథ్యంలో కరుణానిధి సీఎం పీఠాన్ని వదులుకున్నారు. తర్వాత ఇక ప్రత్యక్ష ఎన్నికలకు తన వారసుడిగా స్టాలిన్‌ను రంగంలోకి దించుతున్నట్లు ప్రకటించారు. అయితే అందుకు భిన్నంగా ఈ దఫా ఎన్నికల్లో కూడా తానే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.
చాలాకాలం క్రితమే వీల్ చైర్‌కు కరుణానిధి పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డీఎంకే తరపున ప్రచారం చేసేందుకు కూడా ఆయన రెడీ అవుతున్నారు. ప్రచారం కోసం కొత్త టెంపో ట్రావెలర్ వాహనాన్ని కూడా కొనుగోలు చేశారు. దీనికి ప్రచారానికి అనుకూలంగా రూపొందించాలని డీఎంకే కోయంబత్తూరుకు చెందిన వెహికిల్ రీమోడలింగ్ కంపెనీ ‘కోయాస్’కు అప్పగించింది.
ఈ వాహనంలో కరుణకు అత్యాధునిక వసతులను సమకూరుస్తున్నట్లు సమాచారం. వీల్ చైర్‌లోనే కరుణానిధి సౌకర్యవంతంగా ప్రచారం చేస్తారని తెలుస్తోంది. కరుణానిధి అందులోనే లైవ్ టీవీ ప్రసారాలను వీక్షించే ఏర్పాట్లు చేసినట్లు ‘కోయాస్’ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ రియాజ్ చెప్పారు.