Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14న తెలంగాణాలో ఎంసెట్ పరీక్షలు జరిగేనా?

neet exam
, బుధవారం, 13 జులై 2022 (08:52 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 14వ తేదీన ఎంసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సివుంది. కానీ, గత కొన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో సోమవారం నుంచి బుధవారం వరకు అన్ని రకాల విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. పైగా, గురువారం స్కూల్స్ తెరుచుకుంటాయన్న నమ్మకం కూడా లేదు. ఈ పరిస్థితుల్లో 14వ తేదీ శుక్రవారం జరగాల్సిన ఎంసెట్ పరీక్షలపై సందిగ్ధత నెలకొంది. 
 
బుధవారం కూడా వర్షాలు కురిస్తే  విద్యార్థులు సొంతూళ్ల నుంచి జిల్లా కేంద్రాలకు రాలేని పరిస్థితి ఉంటే పరీక్ష నిర్వహణ కష్టమే. వాతావరణశాఖ మాత్రం ఈనెల 14, 15 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అందువల్ల పరీక్ష నిర్వహణపై సందేహం వ్యక్తమవుతోంది. బుధవారం మధ్యాహ్నం పరిస్థితిని సమీక్షించి ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వర్గాలు చెబుతున్నాయి. 
 
గతంలో ప్రకటించిన కాలపట్టిక ప్రకారం ఈనెల 14, 15 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌, 18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్‌ విభాగం పరీక్ష జరగాలి. వర్షాలు కొనసాగితే అగ్రికల్చర్‌ పరీక్ష నిర్వహణకు ఇబ్బందవుతుందని భావిస్తున్నారు. అలా ఆటంకమైతే వాటిని ఈనెల 16, 17వ తేదీల్లో జరపవచ్చా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. మొత్తానికి బుధవారం ఆయా జిల్లాల నుంచి సమాచారం తెప్పించుకొని తుది నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశం విడిచి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు