దేశ వ్యాప్తంగా నీట్ -2 ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. వైద్య, దంత కళాశాలల్లో ప్రవేశాల కోసం జాతీయ అర్హత, ఉమ్మడి ప్రవేశ పరీక్ష(నీట్)-2ను నిర్వహించనున్న విషయం తెల్సిందే. ఈ పరీక్ష జులై 24న జరగనుందని సీబీఎస్‌ఈ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే తొలి దశ నీట్ పరీక్షను నిర్వహించారు.
ఈ నేపథ్యంలో నీట్-2కు దరఖాస్తులను aipmt.nic.in వెబ్‌సైట్‌లో సమర్పించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీట్-1కు రిజిస్టర్ చేసుకోని లేదా హాజరు కానివాళ్లు, లేదా పరీక్షకు సరిగా సన్నద్ధం కాలేదని భయపడేవాళ్లు.. నీట్-1కు తమ అభ్యర్థిత్వాన్ని వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇస్తూ నీట్-2కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం, సిలబస్, అర్హతల వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
కాగా ఒకే అఖిల భారత ప్రవేశ పరీక్ష నీట్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నుంచి రాష్ట్ర ప్రభుత్వ వైద్య, దంత కళాశాలలకు మినహాయింపునిస్తూ కేంద్రం తయారు చేసిన ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతిపై ఇటీవల సంతకం చేసిన విషయం తెల్సిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అండర్ గ్రాడ్యుయేట్ వైద్య, దంత వైద్య సీట్లలో 85 శాతం సీట్లను సొంత పరీక్ష ద్వారా గానీ నీట్‌తో కలవటం ద్వారా గానీ భర్తీ చేసుకోవచ్చు. మిగతా 15 శాతం సీట్లను నీట్ ద్వారా అఖిల భారత కౌన్సెలింగ్‌తో భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది.