కేంద్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు శుభవార్త చెప్పింది. పేద కుటుంబంలోని పిల్లలు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే కాకుండా ప్రైవేట్ స్కూళ్లలో కూడా చదువుకునేలా చర్యలు తీసుకుంది. దేశంలోని అన్ని ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు కనీసం 25 శాతం సీట్లను కేటాయించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు స్పష్టం చేసింది.
విద్యా హక్కు చట్ట ప్రకారం విద్య అనేది అందరి ప్రాథమిక హక్కు. ఈ హక్కు 6-14 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలందరికీ వర్తిస్తుంది. ఇందుకు సంబంధించి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ లోక్‌సభలో మాట్లాడారు. అన్ని ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, స్పెషల్ కేటగిరీ స్కూళ్లలో 25 శాతం సీట్లను బడుగు, బలహీన, వెనకబడిన వర్గాల పిల్లలకు కేటాయించాల్సిందేనని స్పష్టం చేసారు.
ఈ పిల్లలకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని కూడా ఆయన లోక్‌సభలో స్పష్టం చేసారు. సంబంధిత రాష్ట్రాలు నిర్ణయించిన ఫీజుల ప్రకారమే ప్రభుత్వం చెల్లింపులు చేస్తుందని మంత్రి రమేశ్ పొఖ్రియాల్ ప్రకటించారు.
కాగా ఈ 25 శాతం మంది చిన్నారులకు రిజర్వేషన్ ప్రకారం ఉచిత విద్య అందిస్తున్న స్కూళ్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉండదని స్పష్టం చేసారు. అయితే సంబంధిత పాఠశాలలు ప్రభుత్వం నుండి భూమి, వసతి, పరికరాలు ఉచితంగా లేదా తక్కువ ధరకు పొందవచ్చని మంత్రి వెల్లడించారు.