దేశంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన జొమాటో దేశ వ్యాప్తంగా 225 పట్టణాల్లో తన సేవలను నిలిపివేసిసింది. గత యేడాది డిసెంబరు నెలతో ముగిసిన మూడో త్రైమాసిక నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇదే అంశంపై జొమాటో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అక్షత్ గోయల్ స్పందిస్తూ, జనవరి నెలలో కంపెనీ వ్యాపారం గురించిన కీలక విషయాలను వెల్లడించారు. దాదాపు 225 చిన్న పట్టణాల్లో జొమాటో సేవలను నిలిపివేసినట్టు చెప్పారు. ప్రస్తుత పరిస్థుతులు అనేక సవాళ్లను విసురుతున్నాయని, త్వరలోనే ఇవన్నీ సర్దుకుని పోతాయని భావిస్తున్నట్టు తెలిపారు.
చిన్న పట్టణాల్లో తమ సంస్థ సేవలను మూసివేయడానికి ప్రధాన కారణం.. సరైన వ్యాపారం లేకపోవడమేనని చెప్పారు. అయితే, పట్టణాల్లో వ్యాపారం మూసివేయడం వల్ల కంపెనీ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. అక్టోబరు - డిసెంబరు త్రైమాసిక నివేదిక ప్రకారం కంపెనీ ఆదాయం 75 శాతంగా పెరిగి 1948 కోట్ల రూపాయలకు చేరుకుందన్నారు. నష్టం మాత్రం మూడు రెట్లు పెరిగి 346 కోట్ల రూపాయలకు చేరుకుందని వెల్లడించారు.