జూన్ త్రైమాసికంలో బుకింగ్‌ల పరంగా 15 శాతం క్షీణత కనిపించినప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.12,500 కోట్ల విలువైన ఇళ్లను విక్రయించాలనే తమ లక్ష్యాన్ని సాధిస్తామనే నమ్మకం ఉందని రియాలిటీ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్ కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.10,290 కోట్ల రికార్డు ప్రీ-సేల్స్ సాధించడం ద్వారా సిగ్నేచర్ గ్లోబల్ ఐదవ అతిపెద్ద లిస్టెడ్ రియల్ ఎస్టేట్ సంస్థగా అవతరించింది. గురుగ్రామ్‌కు చెందిన ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.12,500 కోట్ల విలువైన ప్రీ-సేల్స్ లేదా సేల్స్ బుకింగ్‌లను సాధించాలనే లక్ష్యం పెట్టుకుంది.
"ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.12,500 కోట్ల సేల్స్ బుకింగ్‌ల లక్ష్యాన్ని సాధిస్తామని మేము నమ్మకంగా ఉన్నామ"ని సిగ్నేచర్ గ్లోబల్ చైర్మన్ ప్రదీప్ కుమార్ అగర్వాల్ అన్నారు. ముఖ్యంగా ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడంలో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీలకు డిమాండ్ బలంగా ఉందని అగర్వాల్ పేర్కొన్నారు. ఏప్రిల్-జూన్ 2025 త్రైమాసికంలో, కంపెనీ రూ. 2,640 కోట్ల అమ్మకాల బుకింగ్‌లను సాధించింది, దాని ప్రాజెక్టులలో 778 ఇళ్లు అమ్ముడయ్యాయి.
జూన్ త్రైమాసికంలో, కంపెనీ చదరపు అడుగుకు సగటున రూ. 16,296 చొప్పున విక్రయించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం విక్రయించిన చదరపు అడుగుకు రూ. 12,457 కంటే గణనీయమైన వృద్ధి సాధించింది. సిగ్నేచర్ గ్లోబల్ గత ఆర్థిక సంవత్సరం రూ.101.2 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది, ఇది అంతకు ముందు సంవత్సరం రూ.16.32 కోట్ల తో పోలిస్తే గణనీయంగా పెరిగింది. కార్యకలాపాల్ని ప్రారంభించిన నాటి నుండి, సిగ్నేచర్ గ్లోబల్ 14.6 మిలియన్ చదరపు అడుగుల గృహ ప్రాజెక్టులను పూర్తిచేసింది. రాబోయే ప్రాజెక్టులలో దాదాపు 24.6 మిలియన్ చదరపు అడుగుల అమ్మకపు ప్రాంతంను కలిగి ఉంది, అలాగే 49.7 మిలియన్ చదరపు అడుగుల కొనసాగుతున్న ప్రాజెక్టులను రాబోయే 2-3 సంవత్సరాలలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.