స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. 'రియల్‌టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్' పేరుతో కొత్త తరహా పర్సనల్ లోన్ ప్రొడక్ట్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖలో పనిచేసే ఉద్యోగులు, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ సిబ్బంది కోసం ఈ పర్సనల్ లోన్ ఆఫర్ ప్రకటించింది.
వీరంతా బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా కొన్ని నిమిషాల్లోనే పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. క్రెడిట్ హిస్టరీ వివరాలు, అర్హత, డాక్యుమెంటేషన్, లోన్ మంజూరు ప్రాసెస్ మొత్తం డిజిటల్ పద్ధతిలో రియల్‌టైమ్‌లో జరిగిపోతుంది. ఇప్పటికే యోనో యాప్‌లో కస్టమర్లు అందరికీ ఎస్‌బీఐ ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఎస్‌బీఐ అందిస్తున్న రియల్‌టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ (ఆర్టీఎక్స్‌సీ) తీసుకోవాలనుకునేవారు యోనో ప్లాట్‌ఫామ్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. అర్హులైన వారికి రూ.35 లక్షల వరకు లోన్ నిమిషాల్లో మంజూరవుతుంది. పర్సనల్ లోన్ అప్లికేషన్ నుంచి లోన్ అకౌంట్లో జమ కావడం వరకు 100 శాతం పేపర్‌లెస్, డిజిటల్ పద్ధతిలో పూర్తవుతుంది.
ప్రస్తుతం యోనో ఎస్‌బీఐ ఆండ్రాయిడ్ యాప్‌లో మాత్రమే ఈ సదుపాయం ఉంది. రియల్‌టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు తక్కువ అని ఎస్‌బీఐ ప్రకటించింది.
డిజిటల్ డాక్యుమెంట్ ఎగ్జిక్యూషన్ పద్ధతి ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తవుతుంది. ప్రస్తుతం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో డిజిటల్ డాక్యుమెంట్ ఎగ్జిక్యూషన్ అందుబాటులో ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందినవారు మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఒకసారి బ్రాంచ్‌కు వెళ్లాల్సి ఉంటుంది.