Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏప్రిల్ 1 నుంచి ఆన్‌లైన్ చెల్లింపులకు నయా రూల్స్.. ఏంటవి?

ఏప్రిల్ 1 నుంచి ఆన్‌లైన్ చెల్లింపులకు నయా రూల్స్.. ఏంటవి?
, బుధవారం, 31 మార్చి 2021 (13:35 IST)
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభరోజైన ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్ చెల్లింపులకు కొత్త నిబంధనలు అమల్లోకిరానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం మొబైల్‌ రీచార్జీ, యుటిలిటీ బిల్లులు సహా ఇతరత్రా వాటికి సంబంధించి ఆటోమేటిక్‌గా చేపట్టే చెల్లింపులకు తెరపడనుంది. అయితే ఈ చెల్లింపుల కోసం అడిషినల్‌ ఫ్యాక్టర్‌ ఆఫ్‌ అథెంటికేషన్‌ (ఏఎఫ్ఏ)ను భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) తప్పనిసరి చేసింది. 
 
దీంతో మొబైల్‌ ఫోన్‌, డీటీహెచ్‌ లేదా ఓటీటీ సేవల రీచార్జీ, యుటిలిటీ బిల్లుల కోసం ఆన్‌లైన్‌ ద్వారా ఆటోమేటిక్‌గా చెల్లింపులు చేసే వ్యక్తుల సొమ్ముకు మరింత భద్రత ఏర్పడనుంది. ఆర్‌బీఐ ఆదేశాలతో ఇలాంటి ఆటోమేటిక్‌ రికరింగ్‌ చెల్లింపుల (ఏఆర్‌పీ) భద్రత కోసం బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ), పేటీఎం వంటి యాప్స్‌.. ఏప్రిల్‌ 1 నుంచి ఈ నిబంధనలు అమలు చేయబోతున్నాయి. 
 
ఈ చెల్లింపుల మొత్తం రూ.5,000 మించితే డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు జారీ చేసిన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, పేమెంట్‌ యాప్స్‌.. చెల్లింపుదారులకు వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) పంపి.. ఖాతాదారుడి ఆమోదం తీసుకున్న తర్వాతే ఆ లావాదేవీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ (పీపీఐ) లేదా యూపీఐ ద్వారా జరిగే రూ.5,000 మించిన ప్రతి ఏఆర్‌పీ చెల్లింపులకు కూడా ఓటీపీ తప్పనిసరి చేసింది. లేకపోతే ఆ చెల్లింపులను అనుమతించరు. 
 
అయితే, ఇందుకు సంబంధించిన నిబంధనలను అమలు చేసేందుకు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, పేమెంట్‌ యాప్స్‌ ఇంకా సన్నద్ధం కాలేదు. కొన్ని బ్యాంకులైతే ఈ దిశగా కనీస చర్యలు చేపట్టలేదు. ఆర్‌బీఐ ఈ గడువు మరింత పొడిగిస్తుందనే గుడ్డి నమ్మకంతో కాలం వెళ్లదీస్తూ వచ్చారు. తీరా గడువు దగ్గర పడేసరికి ఇంకో నెల రోజులు గడువు ఇవ్వాలని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) ద్వారా కోరాయి. అయితే ఆర్‌బీఐ మాత్రం అందుకు సమ్మతించకపోవడంతో ఇపుడు ఆగమేఘాలపై చర్యలు చేపట్టింది. 
 
ఇదిలావుంటే, ఏప్రిల్ ఒకటో తేదీ గురువారం నుంచి రూ.5000కు మించిన ఆన్‌లైన్‌ రికరింగ్‌ చెల్లింపుల్లో ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. అసలు చెల్లింపులే ఆగిపోతాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. అదే జరిగితే ఈ తరహా చెల్లింపులు చేసే వారు ఆయా బ్యాంకు శాఖలకు వెళ్లి చెల్లింపులు చేయడం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. 
 
కొత్తగా అమల్లోకి వచ్చిన నిబంధనలను ఓసారి పరిశీలిస్తే, 
 
* డెబిట్‌/క్రెడిట్‌ కార్డు లేదా వాలెట్స్‌ ద్వారా ఆటోమేటిక్‌ చెల్లింపులు చేసే ప్రతి వ్యక్తి అడిషనల్‌ ఫ్యాక్టర్‌ ఆఫ్‌ అథెంటిఫికేషన్‌ (ఏఎఫ్ఏ) కోసం వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 
* బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ముందుగానే ఖాతాదారులకు చెల్లించాల్సిన మొత్తం తెలియజేయాలి. 
* చెల్లించాల్సిన మొత్తం రూ.5,000 మించి ఉంటే ఆ విషయాన్ని ఓటీపీ ద్వారా ఖాతాదారులకు తెలపాలి. వారు ఓకే అన్న తర్వాతే ఆ లావాదేవీ పూర్తి చేయాలి.
* డెబిట్‌/క్రెడిట్‌ కార్డులతో పాటు యూపీఐ, వాలెట్‌ చెల్లింపులు అన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. 
* లావాదేవీలు గతంలోలా ఆటోమేటిక్‌గా కాకుండా ఖాతాదారులు ఆమోదం తెలిపిన తర్వాతే పూర్తవుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పైసా ఆస్తులు లేని చింతా మోహన్‌... రత్నప్రభ ఆస్తులు రూ.25 కోట్లు