దేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయిన ICICI బ్యాంక్, ఆగస్టు 2025 నుండి మెట్రో మరియు పట్టణ ప్రాంతాలలో తెరిచిన అన్ని ఖాతాలకు కనీస నెలవారీ సగటు బ్యాలెన్స్(MAB)ను రూ. 10,000 నుండి ఏకంగా రూ. 50,000కు పెంచింది. ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఫైన్లు షురూ చేసింది. దీనితో సేవింగ్స్ ఖాతాదారులు బెంబేలెత్తిపోతున్నారు.
కాగా ఆగస్టు నెల నుంచి అన్ని ప్రాంతాలలో ICICI బ్యాంక్ MABలో పెరుగుదల గణనీయంగా ఉంది. సెమీ-అర్బన్ శాఖలకు గతంలోని రూ. 5,000 నుండి రూ. 25,000కు పెరిగింది. గ్రామీణ శాఖల విషయంలో, ఖాతాలకు మునుపటి రూ. 2,500తో పోలిస్తే రూ. 10,000 కనీస బ్యాలెన్స్ అవసరమని బ్యాంక్ తెలిపింది. కనీస నెలవారీ సగటు బ్యాలెన్స్ అనేది ఒక కస్టమర్ తన బ్యాంక్ ఖాతాలో నిర్వహించాల్సిన కనీస బ్యాలెన్స్. బ్యాంక్ ఖాతాలో బ్యాలెన్స్ అవసరమైన మొత్తం కంటే తక్కువగా ఉంటే, MABని నిర్వహించడంలో విఫలమైనందుకు బ్యాంకులు జరిమానా విధిస్తాయి.
కస్టమర్ కనీస బ్యాలెన్స్ ప్రమాణాలను పాటించకపోతే, అవసరమైన MABలో 6 శాతం లేదా రూ. 500 ఏది తక్కువైతే అది జరిమానా విధించబడుతుందని బ్యాంక్ తెలిపింది. కొత్త షరతులతో పలువురు వినియోగదారులు తమ ఖాతాలను క్లోజ్ చేసుకోవడం బెటర్ అంటూ పెదవి విరుస్తున్నారు.